పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తూలి పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గురువారం రాత్రి కోలకతా కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆమెకు చికిత్స అందిస్తోన్న డాక్టర్లు మాత్రం వెనక నుంచి ఎవరో నెట్టడం వల్లే ఆమె పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
నుదుటి మీద గాయం కావడంతో సీఎం మమతా బెనర్జీ ఆసుపత్రికి వచ్చారని ఎస్‌ఎస్‌కేఎం డైరెక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ మీడియాకు వెల్లడించారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు ఆయన అనుమానించారు. అందుకే ఆమె నుదుటికి గాయం అయిందన్నారు. ముక్కుకు కూడా తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరిగిందని గుర్తించారు. రక్తపోటులో కూడా తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
గురువారం రాత్రి నుంచి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఆమెకి చికిత్స అందిస్తున్నారు. మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఓ అధికారి ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తారా? లేదా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.