Why Muslims are not
eligible in CAA
భారత ప్రభుత్వం తాజాగా అమల్లోకి
తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, భారత
వ్యతిరేక శక్తులు దురుద్దేశపూర్వకంగా ముస్లిములను రెచ్చగొడుతున్నాయి. అలాంటి దుష్ప్రచారాలను
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. సీఏఏ కింద పార్సీలు, క్రైస్తవులు,
ఇతర మైనారిటీలు అర్హులైనప్పుడు ముస్లిములు ఎందుకు కాదు అన్న విషయం గురించి
సవివరంగా తెలియజేసారు.
భారతదేశం నుంచి మత ప్రాతిపదికన విడిపోయిన
పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ నుంచి విడిపోయి ఇస్లామిక్ ఛాందస మతదేశంగా తయారైన
అప్ఘానిస్తాన్‌లలో మైనారిటీ మతాల ప్రజలు తీవ్రమైన చిత్రహింసలకు బలైపోతున్నారు.
అలాంటి హింసను తప్పించుకోడానికి 2014 డిసెంబర్31 కంటె ముందు భారతదేశానికి
శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడమే ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏకైక లక్ష్యం.
ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉన్న ఆయా దేశాల్లో ప్రజలు ఒకప్పుడు భారతీయ ప్రజలే.
భారత్ వారికి సహజంగా మాతృదేశమే అవుతుంది. వారు అక్కడ మైనారిటీలుగా చిత్రహింసలకు
గురవుతున్నందున, వారికి భారతదేశం ఆశ్రయమిచ్చి పౌరసత్వం ఇస్తోంది. ఇక అక్కడి
ముస్లిములు బాధితులు కాదు కాబట్టి, వారు శరణు కోరుతూ భారత్ రావలసిన అవసరం లేదు
కాబట్టి వారికి ఈ చట్టంలో వీలు కల్పించలేదు. అయితే, ఏ దేశం నుంచి అయినా ఏ మతానికి
చెందిన వారయినా భారతదేశంలో నివసించదలిస్తే, భారతీయ చట్టాలకు అనుగుణంగా దరఖాస్తు
చేసుకుని ఇక్కడకు రావచ్చు, పౌరసత్వం పొందవచ్చు. అలా ముస్లిములూ రావచ్చు. అలాగే, ఈ
చట్టం వల్ల దేశంలో పౌరులుగా ఉన్న ముస్లిముల పౌరసత్వాన్ని తొలగించేస్తారని చేస్తున్న
దుష్ప్రచారం కూడా అబద్ధమే. భారతీయ ముస్లిములకు, ఈ చట్టంతో సంబంధమే లేదు. వారు
యధావిధిగా పౌరులుగానే కొనసాగుతారు.
ఆ విషయాలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మరింత స్పష్టంగా చెప్పారు. ‘‘ఆ ప్రాంతాలు (పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్)
ఇవాళ భారతదేశంలో భాగం కాకపోవడానికి కారణం
ముస్లిం జనాభా. ఆ దేశాలను ముస్లిములకే ఇచ్చేసారు. అఖండ భారతదేశంలో భాగంగా ఉండి,
మతపరమైన ద్వేషానికీ, హింసాకాండకూ బలి అవుతున్న వారికి ఆశ్రయం ఇవ్వడం నైతికంగానే
కాదు, భారత రాజ్యాంగపరంగా కూడా మన బాధ్యత’’ అని అమిత్ షా వివరించారు.
అఖండ భారతదేశం అంటే విదేశీ పాలకుల హయాంలో
ముక్కలైపోయిన అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్,
పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్ దేశాలతో కూడిన భారతదేశం. ఇప్పుడు ఆయా దేశాలను మళ్ళీ
భారత్‌లో విలీనం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, హిందువులుగా ఉండిపోయిన నేరానికి చిత్రహింసల
పాలైన వారికి ఆశ్రయం భారతదేశం తప్ప మరింకెవరు ఇస్తారు.
అమిత్ షా ఇంకా ఇలా చెప్పారు, ‘‘దేశ విభజన
సమయంలో పాకిస్తాన్ జనాభాలో 23శాతం మంది హిందువులు. ఇప్పుడు ఆ దేశంలో హిందువుల
జనాభా 3.7శాతానికి పడిపోయింది. వారంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళయితే భారత్‌కు
రాలేదు. వాళ్ళను బలవంతంగా మతమార్పిడి చేసారు. అవమానించారు. రెండోతరగతి పౌరుల్లా
పరిగణించారు. వాళ్ళు ఎక్కడికి వెడతారు? ఆ విషయంలో మన పార్లమెంటు, మన రాజకీయ
పార్టీలూ నిర్ణయం తీసుకోలేవా?’’ అని ప్రశ్నించారు.
‘‘1951లో బంగ్లాదేశ్ జనాభాఃలో హిందువులు
22శాతం ఉండేవారు. 2011లో అది 11శాతానికి దిగజారింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు?
1992లో అప్ఘానిస్తాన్‌లో హిందువులు, సిక్కులు 2లక్షల మంది ఉండేవారు. ఇప్పుడు వారి
సంఖ్య 500 మాత్రమే. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం జీవించే హక్కు లేదా?
భారతదేశం ఒకటిగా ఉన్నప్పుడు వారంతా భారతీయులే. వారు మన సోదరులు, అక్కచెల్లెళ్ళు,
అమ్మానాన్నలే’’ అని అమిత్ షా వివరించారు.
ఆ మూడు ముస్లిం దేశాలలో సైతం షియా,
బలోచ్, అహ్మదీయ తెగల ముస్లిములు విద్వేషానికీ, వివక్షకూ గురయ్యారు. మరి వారి
పరిస్థితి ఏమిటి? ‘‘ప్రపంచంలో ముస్లిం బ్లాక్ అంటూ ఇస్లామ్‌ను అనుసరించే 50కి పైగా
దేశాలున్నాయి. అంతేకాదు. మన దేశంలోనూ పౌరసత్వం కోసం ముస్లిములు కూడా దరఖాస్తు
చేసుకోవచ్చు. దానికి మన రాజ్యాంగంలో వీలుంది. దేశ భద్రత, తదితర అంశాలను దృష్టిలో
ఉంచుకుని భారత ప్రభుత్వం అలాంటి దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుంది. పౌరసత్వ సవరణ
చట్టం – సీఏఏ అనేది ఆ మూడు దేశాల్లోనూ చిత్రహింసలకు గురై, ఎలాంటి సరైన పత్రాలూ
లేకుండా సరిహద్దులు దాటి భారతదేశంలోకి వచ్చే మైనారిటీ వర్గాలకు చెందిన చట్టం
మాత్రమే’’ అని అమిత్ షా స్పష్టం చేసారు.
అసలు ఏ పత్రాలూ లేనివారి
సంగతేంటి అని ప్రశ్నించినప్పుడు, దానికి ఓ పరిష్కారం కనుగొంటాం. కానీ 85శాతానికి
పైగా శరణార్థుల దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అని అమిత్ షా చెప్పారు.