పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడంతో దీనిపై అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. సీఏఏ అమలు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. సీఏఏ తమను ఆందోళనకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. భారత్ దీన్ని ఎలా అమలు చేస్తుందో నిశితంగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు.
భారత్ అమల్లోకి తీసుకువచ్చిన సీఏఏపై మేం ఆందోళన చెందుతున్నాం. ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తామంటూ మిల్లర్ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రమిదని మిల్లర్ అభిప్రాయపడ్డారు.
బంగాదేశ్, పాకిస్థాన్, ఆప్గాన్ నుంచి వలస వచ్చిన కాందిశీకుల వద్ద ఎలాంటి పత్రాలు లేక పోయినా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా కేంద్రం 2019లో సీఏఏ చట్టం తీసుకువచ్చింది. అయితే వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. సార్వత్రిక ఎన్నికల ముంగిట సీఏఏ అమల్లోకి తీసుకురావడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.