నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడాకు చెందిన మీడియా సంస్థ రూపొందించిన కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది. ఖలీస్థాన్ ఉగ్ర సంస్థను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది కెనాడాలోని ఓ గురుద్వారా సమీపంలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఇతని హత్య వెనుక భారత హస్తముందని కెనాడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తరవాత ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కెనడా సహకారంతో సీబీసీ వార్తా సంస్థ నిజ్జర్ హత్యపై కాంట్రాక్ట్ టు కిల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. 45 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హత్య సమయంలోని రికార్డైన సీసీటీవీ ఫుటేజీ కూడా చొప్పించారు. డాక్యుమెంటరీ వివాదంగా మారడంతో దీని ప్రసారాన్ని భారత్ నిషేధించింది.
నిజ్జర్ హత్యపై డాక్యుమెంటరీని ఏకపక్షంగా రూపొందించడంపై కేంద్ర సమాచార శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది.కేంద్రం ఆదేశాలతో యూజర్లు చూడకుండా యూట్యూబ్, ఎక్స్ సంస్థలు పరిమితులు విధించాయి.