జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై
ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. లోక్సభకు పోటీ చేస్తారని గత కొంతకాలంగా జరుగుతున్న
ప్రచారానికి తెరపడింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి
పోటీలో ఉంటున్నట్లు పవన్ తెలిపారు.
ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని
స్పష్టం చేసిన పవన్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందన్నారు.
జనసేన సోషల్ మీడియా
కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
2014లో జనసేన ఆవిర్భావం
తర్వాత తెలంగాణ, పిఠాపురం నుంచి పోటీ చేయాలని తనను పలువురు కోరినట్లు పవన్
తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో అక్కడ ఆఫీసు
ప్రారంభించినట్లు తెలిపారు. కానీ ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు.
2019 ఎన్నికల్లో
గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా వచ్చే
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.
ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన
జనసేన పార్టీ మరో 9 స్థానాలకు అభ్యర్థులను
ఖరారు చేసింది. పెందుర్తి నుంచి పంచకర్ల రమేశ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ
యాదవ్ కు టికెట్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం.
తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి
శ్రీనివాస్, ఉంగటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్,
భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీలో ఉండనున్నారు. రాజోలు నుంచి
దేవవరప్రసాద్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీ దాదాపు ఖరారు అయినట్లు
తెలుస్తోంది.
నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, కాకినాడ
నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ ఇప్పటికే ఖరారైంది.