భారత
ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్లు నియామకం అయ్యారు. జ్ఞానేష్ కుమార్,
సుఖ్ భీర్ సింగ్ సంధులను కమిషనర్లుగా సెలక్షన్ కమిటీ నియమించింది. ఈ విషయాన్ని
సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదురి తెలిపారు.
ప్రధాని
నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదురి పాల్గొన్నారు.
కొత్తగా
నియమితులైన ఇద్దరు కమిషనర్లు, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రధాన కమిషనర్ కు
సహాయకారులుగా వ్యవహరిస్తారు.
గతంలో
సెలక్షన్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండేవారు. అయితే
ఎన్డీయే ప్రభుత్వం నిబంధనల్లో మార్పు చేసింది. సుప్రంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బదులు కేంద్ర మంత్రిని సభ్యుడిగా నియమించింది. దీనికి కాంగ్రెస్ అభ్యతరం
చెబుతోంది.
మెజారిటీ సభ్యులు పాలక పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో తమ
అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని అధిర్ రంజన్ చౌదురి అన్నారు.
సమావేశానికి
ఒక రోజు ముందు తనకు 212 మంది పేర్లు
పరిశీలనకు ఇచ్చిరాని చెప్పిన అధిర్, అంత
పెద్ద జాబితాను ఒక్కరోజులో తాను ఎలా పరిశీలిస్తానని ప్రశ్నించారు. సమావేశానికి ముందు ఆరుగురి పేర్లు
షార్ట్ లిస్ట్ చేసి తనకు ఇచ్చారన్నారు. మెజారిటీ సభ్యులు పాలక కూటమి నుంచి ఉన్నందున
వారి ఇష్టానుసారమే నియామకం జరిగిందన్నారు. నియామక ప్రక్రియపై తన అసంతృప్తిని
తెలియజేశానన్నారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రేపోమాపో వెల్లడి కాబోతున్న
సమయంలో అరుణ్ గోయల్ కమిషనర్ పదవికి రాజీనామా
చేశారు. అంతకు ముందు కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. దీంతో ఖాళీగా ఉన్న
రెండు కమిషనర్లు పోస్టులను సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది.