ఒకే
దేశం- ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత ప్రభుత్వం నియమించిన అత్యున్నత
స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది.
మాజీ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ నేతృత్వంలోని ఈ కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణకు
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ,
శాసనసభ స్థానాలకు నిర్వహించేందుకు కమిటీ సమ్మతి తెలిపింది.
ఈ
రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ కు వెళ్ళిన కోవిద్ కమిటీ సభ్యులు, జమిలి ఎన్నికల
నిర్వహణపై అధ్యయన నివేదికను దేశ ప్రథమ పౌరురాలికి అందజేశారు.
లోక్సభ,
అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని
కోవింద్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో
ప్రభుత్వం, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత పెరుగుతోందని కమిటీ అభిప్రాయపడింది. జమిలి
ఎన్నికల విధానంతో భారత్ ఆకాంక్షలు వాస్తవ రూపం దాలుస్తాయని పేర్కొంది.
రాష్ట్ర
ఎన్నికల సంఘంతో జాతీయ ఎన్నికల సంఘం చర్చలు జరిపి మూడు స్థాయిల్లో ఎన్నికల కోసం
ఉమ్మడి ఓటర్లు జాబితా జారీ చేయాలని సూచించింది.
జమిలి
ఎన్నికల నిర్వహణపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన
2023లో సెప్టెంబర్ లో కమిటీ వేసింది. ఈ కమిటీ దాదాపు 190 రోజుల పాటు
న్యాయనిపుణులు, రాజకీయ పార్టీల అధినేతలు, ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరిపి
అభిప్రాయాలు సేకరించింది. మొత్తం 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించగా 32
పార్టీలు జమిలికి మద్దతు తెలిపాయి.
కమిటీ ప్రజాభిప్రాయం కోరగా, 21,558 స్పందనలు
వచ్చాయి. వాటిలో 80 శాతం మంది జమిలి విధానాన్ని సమర్థించారు. అందరి అభిప్రాయాలు, సూచనలు,
సలహాలు, న్యాయపరమైన సలహాలను క్రోడీకరించిన కోవింద్ కమిటీ సమగ్ర నివేదికను
రాష్ట్రపతికి అందజేసింది.
ఒకే
దేశం-ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా నివేదికను త్వరలో అందజేసే అవకాశముంది.
జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా అధ్యాయాన్ని సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది.