వైసీపీ నుంచి మరో ఎంపీ జంప్ అయ్యారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ గత నెల రోజులుగా గగ్గోలు పెట్టిన సంజీవ్ కుమార్, తాజాగా టీడీపీలో చేరిపోయారు.
ఐదేళ్ల వైసీపీ పాలనపై ఎంపీ సంజీవ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైసీపీ పాలనలో బీసీలకు సామాజిక న్యాయం జరగలేదని, బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. బీసీలకు పదవులు ఇచ్చి, అధికారం లాక్కున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు టీడీపీలో చేరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కర్నూలు నుంచి కూలీల వలసలను నివారించలేకపోయినట్లు బాధపడ్డారు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా సరఫరా చేయలేకపోయానని వాపోయారు. ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.