PM lays foundation for three semiconductor projects
భారతదేశం అనతికాలంలోనే ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పాదన
కేంద్రం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇవాళ ఆయన లక్షా 25వేల కోట్ల
విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసారు. దేశంలో సెమీకండక్టర్
ప్లాంట్ పెట్టాలన్న ప్రయత్నాలు సాకారం కావడానికి 64ఏళ్ళు పట్టిందన్నారు. ఈ ప్రయత్నాలు
1960లోనే మొదలైనా, దాని ప్రాధాన్యతను కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని
మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టులలో మొదటిది గుజరాత్‌లోని ధోలేరా స్పెషల్
ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌లో నిర్మించనున్న, దేశంలోని మొట్టమొదటి కమర్షియల్
సెమీకండక్టర్ ఫ్యాబ్. రెండోది అస్సాంలోని మోరిగావ్‌లో తలపెట్టిన ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్
అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. మూడోది గుజరాత్‌లోని సనంద్‌లో ప్రతిపాదించిన ఔట్సోర్స్డ్
సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. ఈ పరిశ్రమల వల్ల దేశ యువతకు లబ్ధి
చేకూరుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈశాన్య రాష్ట్రాలు ఆగ్నేయాసియా దేశాలతో
మరింతగా కనెక్ట్ అవగలిగేలా బలోపేతం అవుతాయన్నారు. ఈశాన్య భారతంలో ఇలాంటి పరిశ్రమ
ఏర్పడుతుందని గతంలో ఎవరూ కనీసం ఊహించలేదని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ చిప్‌ల
తయారీ రంగం భారతదేశాన్ని స్వయంసమృద్ధం చేస్తుందన్నారు.
దేశంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి తమ
ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని మోదీ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సులభతర
వాణిజ్యాన్ని సాధించడంపై దృష్టి కేంద్రీకరించిందని, అందుకే కాలాతీతమైపోయిన 40వేలకు
పైగా నియమనిబంధనలను రద్దుచేసిందని వివరించారు.
ధోలేరాలో ఫ్యాబ్రికేషన్
ఫెసిలిటీని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 91వేల కోట్ల రూపాయల పెట్టుబడితో
నిర్మిస్తోంది. ఇది సెమీకండక్టర్ రంగంలో దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య పరిశ్రమగా
నిలుస్తుంది.