NZ questions Canada on Nijjar murder case
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్
ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలపై న్యూజీలాండ్ అనుమానాలు వ్యక్తం చేసింది.
దానికి సంబంధించిన ఆధారాలను చూపాలని కెనడాను కోరింది. ‘ఫైవ్ ఐస్’ నిఘా కూటమిలో
భాగమైనప్పటికీ కెనడా ఇప్పటివరకూ తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేదని
న్యూజీలాండ్ వెల్లడించింది.
న్యూజీలాండ్ ఉపప్రధానమంత్రి – విదేశాంగ మంత్రి
అయిన విన్‌స్టన్ పీటర్స్ నాలుగురోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఆ
సందర్భంగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో అంతర్జాతీయ సంబంధాల గురించి
ప్రస్తావన వచ్చింది. నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం భారతదేశంపై ఆరోపణలు
చేసినా, వాటికి సంబంధించి కచ్చితమైన సాక్ష్యాలు ఇప్పటివరకూ చూపించలేదని
తెలియజేసారు.
‘ఫైవ్ ఐస్’ అంతర్జాతీయ నిఘా కూటమిలో ఐదు దేశాలు
భాగస్వాములుగా ఉన్నాయి. అవి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్.
భారతదేశంపై కెనడా ఆరోపణలు చేసినప్పుడు ఫైవ్ ఐస్ ప్రస్తావన వచ్చింది. ఆ కూటమిలోని
న్యూజీలాండ్, అదే కూటమిలోని కెనడా వాదనకు వ్యతిరేకంగా మాట్లాడడం గమనార్హం. నిజ్జర్
హత్య కేసు విషయంలో కెనడా ఆరోపణలను ఫైవ్ ఐస్ సభ్యదేశం ప్రశ్నించడం ఇదే మొదటిసారి.
నిజ్జర్ కేసులో కెనడాతో
విభేదించిన న్యూజీలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్‌ను ఖలిస్తానీ
వేర్పాటువాద ఉగ్రవాదుల నాయకుడు గురుపత్వంత్‌సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడడం
తాజా పరిణామం.