Foreign Media Malicious Propaganda on CAA
ఆధునిక ప్రపంచ చరిత్రలో విదేశీ ఆక్రమణదారులు తాము
ఆక్రమించిన భూభాగాన్ని వదిలి వెళ్ళక తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రాంతంలో ఎప్పటికీ
సుస్థిరత ఉండకూడదన్న దురుద్దేశంతో మతపరంగా ఖండఖండాలుగా విభజించిన ఒకేఒక దేశం
భారతదేశం. అలాంటి ఖండిత ప్రాంతాల్లో స్థానికులైన హిందువులను మతపరంగా పైచేయి
సాధించిన ముస్లిములు చిత్రహింసలు పెట్టి, దాడులు చేసి నిర్మూలిస్తున్న తరుణంలో
వారికి మాతృభూమి అయిన భారతదేశం ఆశ్రయం కల్పించడానికి చేసిన చట్టం పౌరసత్వ చట్టం. ఆ
చట్టంలో కాలాతీతమైన సందర్భాలకు కొన్ని సవరణలు చేసి, అమల్లోకి తీసుకొచ్చినదే
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పౌరసత్వ సవరణ చట్టం.
భారతదేశం నుంచి బ్రిటిష్‌వారు అన్యాయంగా విడగొట్టిన
అప్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే దేశాల్లో హిందువులు, సిక్కులు, జైనులు,
పార్సీలు, బౌద్ధులు, క్రైస్తవులు… ఇలాంటి మతపరమైన మైనారిటీలపై జరిగిన, జరుగుతున్న
అన్యాయాల అక్రమాలు అరాచకాలూ అందరికీ తెలిసినవే. అలాంటి వారికి స్వేచ్ఛగా జీవించే
హక్కు కల్పించడం కోసం భారతదేశం ఆశ్రయం కల్పిస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం
వచ్చిన నాటినుంచీ, అంటే మొదటి ప్రధానమంత్రి జవాహర్లాల్ నెహ్రూ హయాం నుంచీ ఈ చట్టం
అమల్లో ఉంది. ఇప్పుడు ఆ చట్టానికి కొద్దిపాటి సవరణలు చేసారు. అది పూర్తిగా మన దేశ
అంతర్గత విషయం. కానీ దానిపై విదేశీ మీడియా విషప్రచారం చేస్తోంది. ఇంగ్లండ్,
అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా… ఇలా ఏ ఒక్క దేశమో కాదు, ప్రపంచ మీడియా మొత్తం
భారతదేశంలో ముస్లిముల పట్ల ఘోరాలు జరిగిపోతున్నాయంటూ గొంతు చించుకుని ఘోషిస్తున్నాయి.
భారతదేశపు పౌరసత్వ సవరణ చట్టం నుంచి ముస్లిములను విస్మరించారు…
ఇదీ అంతర్జాతీయ మీడియా చేసిన, చేస్తున్న దుష్ప్రచారం. భారతదేశ వ్యతిరేక ప్రచారం
చేయడం, ముస్లిములను బాధితులుగా చూపించడం ఇదే ఆ మీడియా సంస్థల విధానం. 2024 మార్చి
11న నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సీఏఏను నోటిఫై చేసిననాటి నుంచీ ఆ
మీడియా సంస్థలన్నీ భారతదేశంలో ముస్లిములు వివక్షకు గురవుతున్నారంటూ
మొత్తుకుంటున్నాయి.
కతార్ కేంద్రంగా నడిచే అల్‌జజీరా మీడియా సంస్థ,
సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా ప్రచారం చేస్తోంది. నిజానికి సీఏఏ చట్టంలో
ముస్లిముల గురించి కనీసం ప్రస్తావన అయినా లేదు. అయినప్పటికీ ‘‘ఎన్నికలకు
కొద్దివారాల ముందు భారతదేశం ముస్లిం వ్యతిరేకమైన 2019 నాటి పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి
తీసుకొచ్చింది’’ అనే శీర్షికతో భారతదేశ వ్యతిరేక వ్యాసం ప్రచురించింది.
భారతదేశానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో,
అల్‌జజీరా కథనాన్ని ‘తప్పుదోవ పట్టించేది’ అంటూ దుయ్యబట్టింది. ‘‘అల్‌జజీరా
ఇంగ్లిష్ మీడియా భారతదేశపు సీఏఏ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. ఆ
చట్టం ముస్లిం వ్యతిరేకం అంటూ పాఠకులను తప్పుదోవ పట్టిస్తోంది. మతంతో సంబంధం లేకుండా
ఏ భారతీయ పౌరుడి పౌరసత్వాన్నీ సీఏఏ తొలగించదు. ఆ చట్టం ఏ మతానికీ,
సామాజికవర్గానికీ వ్యతిరేకం కాదు. భారత్‌కు పొరుగుదేశాలైన అప్ఘానిస్తాన్,
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఊచకోతకు గురైన మైనారిటీలకు భారతదేశంలో పౌరసత్వం ఇచ్చే
చట్టం మాత్రమే అది’’ అని పీఐబీ వివరణ ఇచ్చింది.
బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ సైతం అదే పద్ధతి
అనుసరించింది. భారత వ్యతిరేక విద్వేష ప్రచారం చేయడంలో దిట్ట అయిన బీబీసీ, సీఏఏ
గురించి ప్రచురించిన కథనం ‘‘ముస్లిములను దేశం నుంచి విడదీసే వలసదారుల చట్టాన్ని
భారతదేశం అమల్లోకి తెచ్చింది’’ అని చెబుతోంది.
ఇంగ్లండ్‌కే చెందిన మరో మీడియా సంస్థ ది
గార్డియన్ ‘‘భారతదేశం అమలు చేసిన పౌరసత్వ చట్టం ముస్లిముల పట్ల వివక్ష చూపుతోందన్న
విమర్శలు ఎదుర్కొంటోంది’’ అని వ్యాఖ్యానించింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఎస్బిఎస్ వార్తాసంస్థ కూడా
‘‘భారతదేశం ముస్లిం వ్యతిరేక పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తోంది’’ అంటూ కథనం
ఇచ్చింది.
ఇంక అమెరికాకు చెందిన వాయిస్ ఆఫ్ అమెరికా అయితే
‘‘ముస్లిములు లేకుండా పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేందుకు భారతదేశం అడుగులు
వేస్తోంది’’ అని రాసుకొచ్చింది.
ముస్లిముల పట్ల సానుభూతి చేపే ఉదారవాదులుగా
చెప్పుకునే పాశ్చాత్య మీడియా సంస్థలన్నీ భారతదేశం పట్ల విషంగక్కుతూ ప్రపంచమంతటా భారతదేశంపై
విద్వేషాన్ని విస్తరింపజేయడానికి తమ శాయశక్తులా పాటుపడుతున్నాయి. నిజానికి భారతదేశం
నుంచి విడగొట్టబడిన దేశాల్లో అత్యాచారాలకు బలైపోతున్న మైనారిటీలకు ఆశ్రయం
కల్పించడం అనే మానవతాపూర్వకమైన, ప్రశంసనీయమైన గొప్ప చట్టాన్ని భారతదేశం అమలు
చేస్తుంటే, ఆ మీడియా సంస్థలన్నీ ముస్లిం మతాన్ని బాధితమతంగా ప్రచారం చేస్తూ వారిని
భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి.
సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టమంటూ నిస్సిగ్గుగా ప్రచారం
చేస్తున్న ఈ మీడియా సంస్థలన్నీ గుర్తించకుండా పక్కన పెట్టేసిన విషయం ఏంటే ఈ చట్టం,
విభజిత దేశాల్లో చిత్రహింసలు అనుభవించిన, అనుభవిస్తున్న హిందువులు, సిక్కులు,
జైనులు, పార్సీలు, బౌద్ధులు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పిస్తోంది. వారందరినీ వదిలిపెట్టి
ముస్లిములకు మాత్రం పౌరసత్వం ఇవ్వడం లేదంటూ రచ్చ చేస్తుండడం వెనుక వారి ఎజెండా
ఏమిటో స్పష్టంగా అర్ధమవుతోంది. భారతీయ ముస్లిములలో భయాందోళనలు కలగజేయడం, మోదీ
ప్రభుత్వంపై ముస్లిం వ్యతిరేకి అన్న ముద్ర వేయడం, దేశంలో హింసాకాండను
ప్రజ్వరిల్లజేయడం… ఇవీ, విదేశీ మీడియా సాధించదలచిన లక్ష్యాలు.
భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక ముస్లిందేశాలుగా
ఏర్పడిన పొరుగుదేశాల్లో చిత్రహింసల పాలైన మైనారిటీల కోసమే సీఏఏ చట్టం ఉద్దేశించబడింది.
ఇస్లామే ప్రభుత్వ మతంగా ఉన్నచోట్ల ముస్లిములు మైనారిటీలు కారు, వారు ఎలాంటి
చిత్రహింసలకూ లోను కాలేదు. ఆ అసలు విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి, పదేపదే
‘ముస్లిములను విస్మరించారు’ అంటుండడం ద్వారా ప్రధానస్రవంతి మీడియా సంస్థలు అసలైన
బాధితులకు అన్యాయం చేస్తున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్,
బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్ దేశాలలో చిత్రహింసల పాలవుతున్న మైనారిటీ వర్గాల ప్రజలు
2014 డిసెంబర్ 31లోగా భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం
ఇస్తారు. ముస్లిములలో షియా, అహ్మదీయ తెగల వారు కూడా ఆయా దేశాల్లో చిత్రహింసలకు
గురైన వారే కదా, వారికి భారత పౌరసత్వం ఎందుకివ్వరు అని ప్రశ్నిస్తున్నారు. దానికి
కారణం ఒకటే. వారు ఆ దేశాల్లో మైనారిటీలు కారు. అక్కడ ప్రధానమతమైన ఇస్లాంకు
చెందినవారే. వారిపై అరాచకాలు జరిగి ఉండొచ్చు, కానీ అది మతహింస కిందకు రాదు.
పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశంలో షియాలు, అహ్మదీయులు ఎదుర్కొనే సమస్యలు ఆ దేశపు
శాంతిభద్రతల సమస్య కిందకు వస్తాయి, వాటిని ఆ దేశమే పరిష్కరించుకోవాలి.
భారతదేశంలోకి అక్రమంగా చొరబడే వారిని ఉద్దేశించి
ఉన్న నియమనిబంధనలపై సీఏఏ ఎలాంటి ప్రభావమూ చూపించదు. పైగా, ఇప్పటికే భారతదేశంలో
శరణార్థులుగా ఉన్నవారికి మాత్రమే సీఏఏ వర్తిస్తుంది. భారతదేశానికి చట్టబద్ధంగా
వచ్చే విదేశీయులకు లేదా భారత్‌లో ఆశ్రయం కోరేవారికి ఇప్పుడు అమల్లో ఉన్న
నియమనిబంధనలే వర్తిస్తాయి. ఏ దేశం నుంచి అయినా ముస్లిములు చట్టబద్ధమైన ప్రక్రియలో
భారతదేశానికి రావడానికి అవకాశం ఇప్పటికీ ఉంది.
ప్రపంచంలో 50కి పైగా దేశాలు ఇస్లామిక్ దేశాలు. అలాంటప్పుడు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా అప్ఘానిస్తాన్ నుంచి ముస్లింలలోని ఇతర తెగల వాళ్ళు వలస
వెళ్ళాలనుకుంటే ఆ ఇస్లామిక్ దేశాలకు వెళ్ళవచ్చు. వారు భారతదేశంలో ఆశ్రయం
పొందాల్సిన అవసరం ఏమిటి? పైగా, 1947లో భారతదేశ విభజన మతప్రాతిపదికన జరిగింది. ముస్లిములకు
ప్రత్యేక దేశం ఇచ్చేసారు. అలాంటప్పుడు అక్కడినుంచి ముస్లిములు మళ్ళీ భారత్ రావాలనుకోవడం
విడ్డూరం కాక మరేమిటి? విభజన సమయంలో తమ దేశంలోని మైనారిటీలను బాగా చూసుకుంటామని
పాకిస్తాన్ మాట ఇచ్చింది. ఆ మాటకు ఆ దేశం ఎన్నడూ కట్టుబడి ఉండలేదు. ఇస్లామిక్ దేశాలుగా
ఉన్న అప్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతరుల నరమేధం యధేచ్ఛగా
కొనసాగింది. 1947 నుంచి నేటివరకూ ఆ మూడు
దేశాల్లో మైనారిటీల జనాభా పూర్తిస్థాయిలో పడిపోయింది.
ఇక సీఏఏ వ్యతిరేకవాదులు చేసే మరొక మూర్ఖపు వాదన,
ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘిస్తోంది అని. ఆ అధికరణం ప్రసాదించే
సమానత్వపు హక్కుకు సీఏఏ వ్యతిరేకమని వారి వాదన. కానీ 14వ అధికరణం ఏం చెబుతోంది? భారత
భూభాగంలోని ప్రజలందరికీ సమానత్వపు హక్కు ఉంది, వారందరూ చట్టం దృష్టిలో సమానులే,
భారత భూభాగం మీద అమలయ్యే చట్టాలు వారందరికీ సమానంగా వర్తిస్తాయి. అంతే తప్ప
గణాంకాల పరంగా ప్రజలందరూ సమానమే అని కాదు. అవసరమైన మేరకు తగినట్లు క్లాసిఫికేషన్
చేసే అధికారం రాజ్యానికి ఎప్పుడూ ఉంది. నిర్దిష్టమైన గ్రూపులకు ప్రత్యేకమైన
చట్టాలు చేయడానికి రాజ్యానికి అధికారం ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు భారత
పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర దేశాల శరణార్థులకు వర్తించవు. శరణార్థులకు
పౌరసత్వం ఇవ్వాలా వద్దా అన్నది పూర్తిగా దేశ ప్రభుత్వపు నిర్ణయమే.
భారతదేశం సుస్థిరంగా,
ఆర్థికంగా పటిష్టంగా ఉండడం సహించలేని దేశీయ ఉదారవాదులు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్
తదితర రాజకీయ వాదులతో పాటు విదేశీ మీడియా కూడా భారత స్వావలంబన మీద విషం
కక్కుతోంది. విద్వేషం వెదజల్లుతోంది. ఆ క్రమంలో భాగంగానే సీఏఏ మీద దుష్ప్రచారం
చేస్తోంది.