పౌరసత్వ
సవరణ చట్టం (CAA) అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన
చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. హిందువులతో సమానంగా వారి హక్కులు
కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశంలోని
18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఎలాంటి పత్రాలు
సమర్పించాల్సిన అవసరం లేదని వివరిస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో పీడనకు గురైన
ముస్లిమేతర మైనారిటీలు 2014 డిసెంబరు 31లోపు భారత్ కు వస్తే వారికి పౌరసత్వం
ఇచ్చేలా సీఏఏ-2019 చట్ట నిబంధనల్ని కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈ ప్రకటనపై
కేంద్ర హోంశాఖ మరింత సష్టతనిచ్చింది.
ఆ
మూడు ముస్లిం దేశాల్లో మైనారిటీలు పీడనకు గురి కావడంతో ఇస్లాం అనే పదానికి
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అపనింద ఏర్పడిందని, బారత్ లోకి వలసవచ్చిన శరణార్థుల్ని
వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్లతో మనకెలాంటి ఒప్పందం
లేదు. అక్రమ వలసదారులను వెనక్కి పంపే అంశమే ఈ చట్టంలో లేదు. అపోహలు అనవసరం’’ అని పలు సందేహాలు నివృత్తి చేస్తూ ప్రకటనలో హోంశాఖ
పేర్కొంది.
ఏ
దేశ ముస్లింలైనా పౌరసత్వ చట్టం సెక్షన్-6 కింద భారతీయ పౌరసత్వం కోరవచ్చు. అది
సహజసిద్ధమైన పౌరసత్వాన్ని పరిశీలిస్తుంది’’ అని హోంశాఖ తెలిపింది. ముస్లింలతోపాటు, ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన ఇతర
వ్యక్తులైనా ప్రస్తుత చట్టాల ప్రకారం భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు
అని వెల్లడించింది.
ఈ
మూడు దేశాల్లో ముస్లింలెవరైనా వేధింపులకు గురవుతుంటే వారు ప్రస్తుత చట్టాలను
అనుసరించి భారత్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డుకాదు అని
వివరించింది.
భారత
పౌరసత్వం కోసం బంగ్లాదేశ్, ఆప్గానిస్తాన్, పాకిస్తాన్ శరణార్థులు దరఖాస్తు
చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. సీఏఏ-2019 మేరకు
అర్హత కలిగిన వారు indiancitizenshiponline. nic.in అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ తేదీన భారత్ కు వచ్చారో ఆనాటి నుంచి పౌరసత్వం వర్తిస్తుంది.
‘సీఏఏ-2019’ పేరిట త్వరలో ఓ మొబైల్ యాప్‌ను కూడా కేంద్ర హోం శాఖ తీసుకురానుంది.