Indian Coast Guard apprehended a Pakistani Boat with drugs
అరేబియా సముద్ర ప్రాదేశిక జలాల్లో అనుమానాస్పదంగా
సంచరిస్తున్న ఒక పడవను భారత అధికారులు పట్టుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఆ
పడవలో పెద్దమొత్తంలో డ్రగ్స్ ఉన్నాయి. ముందుగా అందిన సమాచారంతో వలవేసి ఆ పడవను
నిర్బంధించి, అందులో ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసారు.
భారతీయ తీరరక్షక దళం ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు
అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ప్రకారం ఆ ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు
350 కిలోమీటర్ల దూరంలో, అరేబియా సముద్రంలో పడవ ఉందని గుర్తించారు. నార్కోటిక్స్ కంట్రోల్
బ్యూరో, గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఆ పడవలో సుమారు 480 కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు దొరికాయి.
సోమవారం రాత్రి నుంచే కోస్ట్‌గార్డ్ దళాలు తమ
ఓడలను అరేబియా సముద్రంలో వ్యూహాత్మకంగా మోహరించాయి. మాదకద్రవ్యాల పడవ ఎక్కడుందో
కనుగొనడం కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన డోర్నియే ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ప్రాంతం
మొత్తాన్నీ స్కాన్ చేసింది. కోస్ట్‌గార్డ్ ఓడలు, నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్
బృందం, గుజరాత్ ఏటీఎస్ బృందం జాగ్రత్తగా సముద్రాన్ని పరిశీలిస్తూ చీకటిలో
అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న పడవను గుర్తించారు. కోస్ట్‌గార్డ్ ఓడలు ఆ పడవను
ఆగిపొమ్మని ఆదేశించినా, అందులోని వారు తప్పించుకుని పారిపోడానికి ప్రయత్నించారు.
దాంతో సంయుక్త బృందాలు ఆ పడవను వెంటాడి వేటాడి నిలువరించాయి. బోర్డింగ్ టీమ్
వెంటనే ఆ పడవ మీదకెక్కి తనిఖీలు చేపట్టింది.
ఆ పడవ పాకిస్తానీ పడవ అని స్పష్టంగా వెల్లడైంది.
అందులో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బోర్డింగ్ టీమ్ ఆ పడవను క్షుణ్ణంగా శోధించి,
అందులో సుమారు 480కోట్ల రూపాయల విలువైన 80కేజీల మాదకద్రవ్యాలు ఉన్నాయని కనుగొంది.
ఆ పడవను పోర్‌బందర్ తీరానికి తీసుకొచ్చారు, అందులోని వారిని అరెస్ట్ చేసారు.
కోస్ట్‌గార్డ్, ఎన్‌సీబీ, గుజరాత్ ఏటీఎస్ బృందాల
సంయుక్త కృషితో ఇలాంటి పడవలను నిర్బంధించడం గత మూడేళ్ళలో ఇది పదోసారి. ఈ మూడేళ్ళలోనూ
ఇప్పటివరకూ రూ.3135 కోట్ల విలువైన 517 కేజీల మాదక ద్రవ్యాలు పాకిస్తాన్ నుంచి
భారత్‌కు అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డాయి.