పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు
శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్ర
ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని ఇండియన్
యూనియన్ ముస్లిం లీగ్, సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
2019లో
కూడా సీఏఏ పై ఐయూఎంఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయనందున
ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం
కోర్టుకు వివరణ ఇచ్చింది.
తాజాగా
నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంతో, విషయం మళ్ళీ కోర్టుకు చేరింది. ఈ అంశాన్ని సవాలు
చేస్తూ దాఖలైన 250
పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు చట్టం అమలుపై
స్టే విధించాలంటూ పిటిషన్లో ఐయూఎంఎల్ కోరింది.
సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఆమోదం పొందింది.
పూర్తిస్థాయి నిబంధనలపై స్పష్టత నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చేందుకు సమయం
పట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్
షా తెలిపారు. అందుకు తగ్గట్టుగానే నోటిఫికేషన్ జారీ అయింది.
కొందరిపై
వివక్ష చూపేలా ఉంటే సీఏఏను అమలుచేయబోమని
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించగా ఈ చట్టాన్ని తాము అమలుచేయమని కేరళ
ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. తమిళనాడు
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా సీఏఏ
విషయంలో ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు.