ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారైంది. మార్చి 17న చిలకలూరిపేటలో జరనున్న ఎన్డీయే కూటమిలోని పార్టీల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి తమకు అధికారిక ప్రకటన అందిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఐదేళ్ల తరవాత బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఒకే వేదికపైకి రానున్నారు.
చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ రానుండటంతో టీడీపీ, జనసేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సభను విజయవంతం చేసేందుకు టీడీపీ 13 కమిటీలను నియమించింది. మూడు పార్టీల నేతల సమ్వయంతో పనిచేసి ఈ సభను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలోని అన్ని ప్రాంతాల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కూడిన కమిటీలు సభ ఏర్పాట్లు చేయనున్నాయి. సభకు ఎలా సంసిద్ధం కావాలన్న దానిపై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు చర్చలు జరిపారు.