దేశంలో అత్యంత వేగంగా పరుగులు తీసే పది కొత్త వందేభారత్ రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ పది వందేభారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా రెండు వందేభారత్ రైళ్లు పట్టాలెక్కియి.సికింద్రాబాద్ విశాఖ మధ్య ఇప్పటికే ఒక వందేభారత్ నడుస్తోంది. నేటి నుంచి మరో వందేభారత్ ఈ మార్గంలో అందుబాటులోకి వచ్చింది. కలబురగి బెంగళూరు మార్గంలోనూ మరో వందేభారత్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించిన పది వందేభారత్ రైళ్లతో మొత్తం వీటి సంఖ్య 50కు చేరింది.
గుజారాత్లో అహ్మదాబాద్ నుంచి మోదీ పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొత్తం 85 వేల కోట్ల రైల్వే పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణమధ్య రైల్వేలో 9 గతి శక్తి కార్గో టెర్మినళ్లు,గూడ్స్ షెడ్లు, జనఔషధి కేంద్రాలు, రైల్వే కోచ్ రెస్టారెంట్లు ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
కలబురగి -బెంగళూరు, సికింద్రాబాద్- విశాఖ, లక్నో- డెహ్రాడూన్, పాట్నా- లక్నో, జల్పాయ్గుడి- పాట్నా, పూరి- విశాఖపట్నం, వారణాసి- రాంచీ, ఢిల్లీ- ఖజురహో, ముంబై- అహ్మదాబాద్, చెన్నై- మైసూరు మార్గాల్లో పది వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో 45 మార్గాల్లో 50 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి.