All India Muslim Jamaat says Bharatiya Muslims should
welcome CAA
భారత ప్రభుత్వం గత రాత్రి పౌరసత్వ సవరణ చట్టాన్ని
నోటిఫై చేసింది. ఆ పరిణామాన్ని అఖిల భారత ముస్లిం జమాత్ స్వాగతించింది. ఆ చట్టం
భారతదేశపు ముస్లిములపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని జమాత్ అధ్యక్షుడు మౌలానా
షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో మౌలానా షహాబుద్దీన్
రజ్వీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం సీఏఏను నోటిఫై చేయడాన్ని స్వాగతించారు.
‘‘నిజానికి ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా చేసారు. మంచిది. ఈ చట్టం
గురించి ముస్లిములలో చాలా అపార్ధాలూ భయాలూ ఉన్నాయి. నిజానికి ఈ చట్టానికి
ముస్లిములతో ఏ సంబంధమూ లేదు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో
హింసాకాండకు గురై, శరణార్థులుగా భారతదేశానికి వస్తున్న ముస్లిమేతరులకు పౌరసత్వం
ఇవ్వడానికి ఇప్పటివరకూ ఏ చట్టమూ లేదు. ఇప్పుడు దానికోసం చట్టం తీసుకొచ్చారు,
అమల్లోకి తెస్తున్నారు’’ అని మౌలానా షహాబుద్దీన్ రజ్వీ వివరించారు.
‘‘భారతదేశంలోని కోట్లాది ముస్లిములపై ఈ చట్టం ఎలాంటి ప్రభావమూ
చూపించదు. ఈ చట్టం ఏ భారతీయ ముస్లిం నుంచీ అతని పౌరసత్వాన్ని లాగేసుకోదు. గతంలో ఈ
విషయంలో ఆందోళనలూ నిరసనలూ జరిగినమాట నిజమే, కానీ అవన్నీ అపార్ధాల వల్ల మాత్రమే
జరిగాయి. కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా ముస్లిములలో ఈ చట్టం గురించి
అపార్ధాలు కలిగేలా ప్రచారం చేసారు. నిజానికి భారతీయ ముస్లిములందరూ సీఏఏ చట్టాన్ని
స్వాగతించాలి’’ అని మౌలానా షహాబుద్దీన్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరిలో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి స్పష్టత
ఇచ్చారు. సీఏఏ చట్టం కొత్తవారికి పౌరసత్వం ఇవ్వడానికే తప్ప ఇప్పటికే ఉన్నవారికి తొలగించడానికి
కాదు అని వివరించారు. ‘‘మన దేశంలోని మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లిములను
కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వ హక్కునూ
తొలగించలేదు. అసలా చట్టంలో అలాంటి అవకాశమే లేదు’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో సీఏఏ బిల్లును
పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకుంది. దాని ప్రకారం, పాకిస్తాన్,
ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో చిత్రహింసలు అనుభవిస్తున్న ముస్లిమేతరులు భారతదేశంలో
పౌరసత్వం కావాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ చట్టం చేసాక దానికి
వ్యతిరేకంగా ఆందోళనలే పెచ్చుమీరాయి. ఎట్టకేలకు, నాలుగేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత అంటే
ఇఫ్పుడు, కేంద్రప్రభుత్వం ఆ చట్టం అమలుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేసింది.