జాతీయ దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. సోమవారం అర్థరాత్రి ఢిల్లీలో ఎన్కౌంటర్ చోటుచేసుకున్న నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసుల సహకారంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ సోదాలు చేస్తోంది.
గతంలో పలు కేసులకు సంబంధించి విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. జనవరి 6న కూడా ఎన్ఐఏ భారీ సోదాలు చేసింది. గ్యాంగ్‌స్టర్, మారకద్రవ్యాల ముఠా నాయకుడు బిష్ణోయ్‌కు చెందిన ఇళ్లు కూల్చివేతతోపాటు అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ గతంలోనే సోదాలు చేసింది. బిష్ణోయ్ అతని అనుచరులపై ఉపా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.