ఢిల్లీలో సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. పోలీసులకు, గ్యాంగ్స్టర్లకు మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో పోలీసులు సైతం గాయపడ్డారు.
ఢిల్లీలోని హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గూండాలు మార్చి9న ఒక వ్యక్తిని కాల్చి చంపారు.ఈ ఘటనపై కేసు నమోదైంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా గ్యాంగ్స్టర్లు ఎదురు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్యాంగ్స్టర్ల కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు డీసీపీ జాయ్ టిర్కీ వెల్లడించారు. హత్యాయత్నం, హత్య సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.