AP NDA alliance partners finalize on seat sharing
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం
పొత్తు కుదుర్చుకున్న మూడు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో బీజేపీ, జనసేన నేతలతో సోమవారం 8గంటలకు పైగా
సుదీర్ఘంగా జరిగాయి.
రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలూ
ఉన్నాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ
చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.
జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.
బీజేపీ తరఫున కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్,
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా చర్చలకు హాజరయ్యారు. జనసేన తరఫున ఆ పార్టీ
అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుల కోసం టీడీపీ,
జేఎస్పీ అధినేతలు ఈ నెల 7,9 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు.
ఆ చర్చల్లో ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరడం నిశ్చయమైంది. తాజాగా సోమవారం అంటే నిన్న
11వ తేదీన జరిగిన చర్చల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న విషయం నిర్ధారణ అయింది. ఇంక
ఏయే స్థానాల్లో ఏయే అభ్యర్ధులు పోటీ చేయాలన్న విషయం మిగిలుంది.
తెలుగుదేశం ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలకు తమ
అభ్యర్ధులను ప్రకటించింది. అలాగే జనసేన కూడా 5 స్థానాలకు తమ అభ్యర్ధులను
ప్రకటించింది. మిగతా స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించడం మిగిలుంది.
టీడీపీ తమ అభ్యర్ధుల రెండో జాబితాను 14న ప్రకటిస్తుంది.
మూడు పార్టీలూ కలిసి తమ మొదటి ఎన్నికల ప్రచారసభగా
ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద బహిరంగ సభ నిర్వహిస్తాయి.