Modi addresses Sashakt Nari Viksit Bharat program
భారతదేశంలో సాంకేతిక విప్లవాన్ని ముందు నిలిచి
నడిపించేది మహిళలే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన
సశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఈ శతాబ్దంలో
మహిళలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంతరిక్షం, విజ్ఞానశాస్త్ర రంగాల్లో గొప్పపేరు గడిస్తున్నారు.
కమర్షియల్ విమానాలు నడిపే మహిళా పైలట్ల సంఖ్య ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే
అత్యధికం. సమీప భవిష్యత్తులో దేశంలో డ్రోన్ సాంకేతికత మరింత పెరుగుతుంది. ‘నమో
డ్రోన్ దీదీ’లకు లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి. గత దశాబ్దకాలంలో దేశంలోని
స్వయం సహాయక బృందాల ఎంత విస్తరించాయి, ఎలా ఎదిగాయి అన్న అంశంపై పరిశోధనలే చేయవచ్చు.
మహిళా సాధికారత సాధనలో స్వయంసహాయక బృందాలు కీలక భూమిక పోషించాయి’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆ
సమావేశంలో లఖ్‌పతి దీదీల విజయగాథలను వివరించారు.
సశక్తి నారీ వికసిత్ భారత్ సందర్భంగా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్వయం సహాయక బృందాలకు 2వేల కోట్ల రూపాయల మూలధన సహాయ
నిధిని అందించారు. ఆ బృందాలకు 8వేల కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాలు
అందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా
దేశవ్యాప్తంగా వెయ్యి మంది మహిళలకు డ్రోన్లు పంపిణీ చేశారు. డ్రోన్ల వినియోగంపై వారికి
ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. దాదాపు 15వేల స్వయం సహాయక బృందాల మహిళలకు
వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇవ్వడమే నమో డ్రోన్ దీదీ పథకం లక్ష్యం. డ్రోన్ల
సహాయంతో విత్తనాలు నాటడం, ఎరువులు చల్లడం, పంటలను పర్యవేక్షించడం వంటివి
నేర్పిస్తారు.