PM Modi inaugurates Dwarka Expressway
‘ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే’తో వాహనాలు మాత్రమే
కాదు, ఢిల్లీ ప్రజల జీవితాలు కూడా వేగం పుంజుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ
వ్యాఖ్యానించారు. ఆయన ఇవాళ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో హర్యానా సెక్షన్‌ను
ప్రారంభించారు.
ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య 48వ నెంబర్ జాతీయ రహదారిపై
ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఆధునిక సాంకేతికత సాయంతో
ప్రజారవాణా సులువవుతోందనీ, ఇప్పుడు దేశం మరింత మెరుగ్గా అనుసంధానమవుతోందనీ మోదీ
చెప్పారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ మీద 9వేల కోట్లకు పైగా
ఖర్చుపెట్టామని వెల్లడించారు.
ఇప్పుడు ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే నిర్మించిన
ప్రదేశం ఒకప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఉండేదనీ, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా
మారిపోయిందనీ మోదీ చెప్పారు. సాధారణ ప్రజలే కాదు, ట్యాక్సీడ్రైవర్లు సైతం ఆ
ప్రదేశానికి వెళ్ళడానికి భయపడేవారనీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయిందనీ వివరించారు.
పెద్దపెద్ద కంపెనీలు ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాయని వివరించారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
హర్యానా సెక్షన్ 19 కిలోమీటర్ల పొడవైన 8-లేన్ల రహదారి. దాని నిర్మాణానికి 4100 కోట్ల
ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో రెండు ప్యాకేజీలున్నాయి. ఢిల్లీ హర్యానా సరిహద్దు నుంచి
బసాయ్ రైల్ ఓవర్ బ్రిడ్జి వరకూ 10.2 కిలోమీటర్ల పొడవున మొదటి ప్యాకేజీ ఉంటే, బసాయ్
రైల్ ఓవర్ బ్రిడ్జి నుంచి ఖెర్కీ దౌలా వరకూ 8.7 కిలోమీటర్ల పొడవున రెండో
ప్రాజెక్టు ఉంది. అంతేకాదు, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని,
గురుగ్రామ్ బైపాస్‌నూ నేరుగా కలుపుతుంది.