రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలు సమర్పించడానికి సమయం కావాలంటూ ఎస్‌బీఐ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్చి 12లోగా వివరాలు అందించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.వచ్చే శుక్రవారం సాయంత్రం నాటికి వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచడానికి ఈసీ వివరాలు కోరుతోందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదనపు సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. మార్చి 12 సాయంత్రానికి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలంటూ ఎస్‌బీఐ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించే వెసులుబాటు ఎన్నికల బాండ్ల ద్వారా కల్పించారు. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు గత నెల 15న రద్దు చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దాతల వివరాలు, తీసుకున్న వారి వివరాలు వేరు వేరుగా ఉన్నాయని, వాటిని మ్యాచ్ చేసి వివరాలు పొందుపరిచేందుకు సమయం కావాలంటూ ఎస్‌బీఐ కోరింది. ఇందుకు కోర్టు నిరాకరించింది.
అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధర్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. గత నెల ఆదేశాలిచ్చాం. సమయం కావాలని మరలా వచ్చారంటూ…ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్ని బాండ్లు జారీ చేశారో చెప్పాలని కోర్టు కోరింది. మార్చి 12 సాయంత్రంలోగా వివరాలు ఈసీకి అందించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.