Cheetah gave birth to five cubs at Kuno National Par
దక్షిణాఫ్రికా నుంచి భారత్ తీసుకొచ్చిన చిరుతపులి
‘గామిని’ ఐదు చిరుతపులిపిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ శివపూర్‌లో ఉన్న కూనో
నేషనల్ పార్క్‌లో ఈ పులికూనలు జన్మించాయి. దీంతో భారతదేశంలో పుట్టిన చిరుతపులిపిల్లల
సంఖ్య 13కు పెరిగిందని కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.
పులికూనల పుట్టుక గురించి భూపేందర్ యాదవ్ ఆదివారం
నాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసారు. ‘దక్షిణాఫ్రికాలోని స్వాలూ కలహరి
రిజర్వ్ నుంచి తీసుకొచ్చిన సుమారు ఐదేళ్ళ వయసున్న ఆడ చిరుతపులి గామిని ఐదు కూనలకు
జన్మనిచ్చింది. దీంతో భారతదేశంలో పుట్టిన పులిపిల్లల సంఖ్య 13కు చేరుకుంది’ అని
ఆయన తెలియజేసారు.
చిరుతపులులు ఒత్తిడిలేని వాతావరణంలో సుఖంగా
ఉండేందుకు శ్రమిస్తున్న కూనో నేషనల్ పార్క్ అధికారులు, ఉద్యోగులను ఆయన కొనియాడారు.
‘అందరికీ అభినందనలు. ప్రత్యేకించి అటవీ అధికారులు, జంతువైద్యులు, ఇంకా చిరుతపులులకు
ఒత్తిడి లేని వాతావరణం ఉండేలా చూస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులకు అందరినీ అభినందిస్తున్నాను. వారి కృషి వల్లనే పులిపిల్లల
పుట్టుక సాధ్యమైంది. దీంతో మొత్తం చిరుతపులుల సంఖ్య 26కు చేరింది’ అని భూపేందర్
యాదవ్ ప్రకటించారు.
ఈ యేడాది జనవరిలో నమీబియా
నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చిరుతపులి కూనో నేషనల్ పార్క్‌లో నాలుగు కూనలకు
జన్మనిచ్చింది. భారతదేశంలో చిరుతపులులు 1952లోనే అంతరించిపోయాయి. 2022లో మోదీ
ప్రభుత్వం దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచడాన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యంగా
తీసుకుంది. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా 2022లో నమీబియా నుంచి ఎనిమిది, 2023లో దక్షిణాఫ్రికా
నుంచి పన్నెండు చిరుతపులులను కూనో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. అయితే 2023 మార్చి నుంచి ఏడు పెద్ద చిరుతపులులు,
మూడు పులికూనలూ చనిపోయాయి.