అల్ ఖైదా ఉగ్రసంస్థ యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్ బటర్ఫీ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అతని మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖలీద్ చనిపోయినట్లు అల్‌ఖైదా అధికారికంగా ప్రకటించింది. అల్ ఖైదా జెండా కప్పివున్న ఖలీద్ మృతదేహం వీడియోలు వైరల్ అయ్యాయి. అతని వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తోంది.
ఖలీద్ తలపై అమెరికా రూ.50 కోట్ల రివార్డు ప్రకటించింది. ఆ దేశంపై దాడులకు అనేకసార్లు ప్రయత్నాలు చేయడంతో భారీ రివార్డు ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తరవాత, అల్ ఖైదాలో యెమెన్ శాఖ అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఖలీద్ మృతి చెందడంతో యెమెన్ శాఖ బాధ్యతలు అతేఫ్ అల్ అవ్లాకీకి అప్పగించారు.
అమెరికాలో వాణిజ్య విమానం కూల్చేందుకు 2009లో అల్ ఖైదా యెమెన్ శాఖ కుట్రపన్నిందని తేలింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన బాంబు దాడులు కూడా ఆ శాఖ పనిగా వెల్లడైంది. అల్ ఖైదా యెమెన్ శాఖను ప్రపంచంలో అంత్యంత ప్రమాదకరమైన శాఖల్లో ఒకటిగా అమెరికా ప్రకటించింది.