యాదగిరిగుట్టలో
రేపటి నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు(మార్చి 11)
స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
మొదటి రోజు ఉత్సవాల్లో తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొననున్నారు. శ్రీ లక్ష్మీనరసింహాస్వామి
దర్శనం తర్వాత ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో
భాగంగా మార్చి 15న మురళీ కృష్ణుడి అలంకారంలో స్వామి వారు దర్శనమిస్తారు. రాత్రికి
హంస వాహనంపై నుంచి భక్తులను స్వామి వారు అనుగ్రహిస్తారు. మార్చి 17న స్వామివారి ఎదుర్కోలు క్రతువు, 18న
తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. దివ్య విమాన రథోత్సవాన్ని 19వ తేదీన నిర్వహించనున్నట్లు
అధికారులు వెల్లడించారు.
పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి
19న ప్రారంభమై 25 వరకు కొనసాగుతాయని తెలిపారు.
బ్రహ్మోత్సవాల
సందర్భంగా మార్చి 11 నుంచి 21 వరకు శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య
కళ్యాణం, జోడు సేవలను ఆలయ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
18 వ తేదీన తిరుకళ్యాణంలో
పాల్గొనే భక్తులు రూ. 3 వేల టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మార్చి 21న అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార
డోలోత్సవం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.