పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామంలా మారిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రాబోయే పదిహేనేళ్లలో ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య మండలి ద్వారా దేశంలోకి 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై భారత్, ఈఎఫ్టీఏ సంతకాలు చేశాయి. మేథోసంపత్తి హక్కులు,సేవల రంగం, వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి రంగాల్లో అడ్డంకులను తొలగించడంలాంటి 14 అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉన్న అడ్డంకులను ఇరువర్గాలు తొలగించనున్నాయి.
ఈ వాణిజ్య ఒప్పందం సమానత్వానికి నిదర్శనమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సేవలు, ఫార్మా, డిజిటల్ ట్రేడ్ రంగాల్లో పరిశోధనలకు ఐరోపా దేశాల సమాఖ్య నాయకత్వం వహిస్తుందన్నారు. గడచిన పదేళ్లలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని ప్రధాని గుర్తుచేశారు. 11వ స్థానం నుంచి భారత్ ప్రపంచంలోని ఐదో అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. రాబోయే ఐదేళ్లలో మూడో స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య కూటమిలో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ దేశాలున్నాయి. కెనడా, చైనా, మెక్సికో, చిలీ వంటి 40 దేశాలతో ఈ కూటమికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్నాయి.