ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ
ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సన్నిహితుడు
సుభాష్ యాదవ్ ను ఇసుక అక్రమ మైనింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ మాఫియాలో
భాగస్వామిగా ఉంటూ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సుభాష్ యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి.
పాట్నా సహా బిహార్ లోని పలు
ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు, శనివారం రాత్రి సుభాష్ యాదవ్ ను
మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా
న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు.
బ్రాడ్సన్స్ కమోడిటీస్ ప్రైవేట్
లిమిటెడ్‌కు డైరక్టర్ గా వ్యవహరిస్తున్న సుభాష్ యాదవ్, ఈ- చలానాలను ఉపయోగించకుండా ఇసుక అక్రమ
మైనింగ్‌కు పాల్పడినట్లు కేసు నమోదు అయింది. అతడిపై 20కి పైగా ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.
సుభాష్
నివాసంతో పాటు మరికొన్ని చోట్ల జరిపిన సోదాల్లో రూ. 2 కోట్లకు పైగా డబ్బుతో పాటు
కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ విక్రయాల ద్వారా రూ.
161 కోట్ల కుంభకోణం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్ కు సంబంధించి ఇటీవలే ఎమ్మెల్సీ రాధా చరణ్ సాహ్, అతడి కుమారుడు అరెస్టు అయ్యారు.