తమ డిమాండ్ల సాధనకు నాలుగు వారాలుగా డిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతోన్న రైతులు మరో అడుగు ముందుకేశారు. ఆదివారం రైల్ రోకో నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులు రైల్ రోకోలో పాల్గొనాలని రైతు సంఘం నాయకుడు సర్వాన్ సింగ్ పంథేర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో ఉంటుందని పంథేర్ వెల్లడించారు.
ఫిబ్రవరి 13న మొదలైన ఢిల్లీ చలో కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ పంథేర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా రైతులు, కూలీలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ నిర్ణయం ప్రయాణీకులకు కొంత అసౌకర్యం కలుగుతుందని, అయినా ఇది పాక్షిక రైల్ రోకో అని పంథేర్ గుర్తుచేశారు.
పంజాబ్‌కు చెందిన వేలాది రైతులు హర్యానా సరిహద్దు శంభు ప్రాంతంలో నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు పలు దఫాలు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం, రైతులు, కూలీలకు పెన్షన్ వంటి సమస్యలకు కేంద్రం సూచించిన పరిష్కారాలకు రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. దీంతో రైతులు మరోసారి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.