సందేశ్‌ఖాలీ
నిందితుడు, ఈడీ అధికారులపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బహిష్కృత టీఎంసీ నేత
షేక్ షాజహాన్‌ను సీబీఐ అధికారులు నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. నిజామ్ ప్యాలస్
నుంచి షాజహాన్‌ను కోర్టుకు తరలించనున్నారు. కస్టడీ గడువు ముగియడంతో బసిర్హట్ న్యాయస్థానంలో షాజహాన్‌ను హాజరుపరచనున్నారు.
షాజహాన్
కేసును సీఐడీకి బదులు సీబీఐ విచారించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో షాజహాన్ ను పశ్చిమబెంగాల్ పోలీసులు షాజహాన్ ను సీబీఐకి అప్పగించారు.
నిందితుడు
రాజకీయంగా కేసుపై ప్రభావం చూపగల్గే వ్యక్తి అయినందున స్థానిక పోలీసులు దాగుడుమూతలు
ఆడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. నిష్పక్షపాత విచారణ కోసం కేసును సీబీఐకి
అప్పగించాలని పేర్కొంది.
రేషన్
కుంభకోణం కేసును దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్ళిన ఈడీ అధికారులపై
కొంతమంది దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఈ కేసులో షాజహాన్ నిందితుడిగా ఉన్నారు.
అప్పటి నుంచి రెండు నెలలుగా పరారీలో ఉన్న షాజహాన్ ను ఫిబ్రవరి 29న పోలీసులు
అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం, పదిరోజుల పోలీసు
కస్టడీకి అనుమతించింది.
సందేశ్‌ఖాలీ ప్రాంతంలో భూకబ్జాలు, మహిళలపై వేధింపులు,
లైంగికదాడి కేసులో కూడా షాజహాన్ నిందితుడిగా ఉన్నాడు. షాజహాన్, అతడి అనుచరుల దాడి
నుంచి రక్షించాలంటూ పలువురు మహిళలు బహిరంగ ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసు సంచలనంగా
మారింది.