TDP likely to join NDA, what will happen to AP BJP?
2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బైటకు వెళ్ళిపోయిన
తెలుగుదేశం పార్టీ, మరోసారి అదే కూటమిలో చేరడం దాదాపు ఖాయమైనట్లే ఉంది. ప్రత్యేక
హోదా అంశం సాకుతో కూటమినుంచి వైదొలగిన టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పట్లో
తిరుపతిలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలే రాళ్ళు విసిరిన అమిత్ షాను ఇవాళ
కలిసారు. ప్రస్తుతం అధికారికంగా ఎన్డీయేతో పొత్తులో ఉండి, తెలుగుదేశంతో ఎన్నికల
సీట్ల సర్దుబాటు చేసుకున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా ఆ సమావేశానికి
హాజరయ్యారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై
పోరాటానికి అన్నిశక్తులూ ఒడ్డుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బీజేపీని కూడా ఆ
పోరాటంలో భాగస్వామిని చేసుకోవాలని వ్యూహం రచించారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాలను
వ్యక్తిగత స్థాయిలో దూషించిన పాత కథలన్నీ పక్కన పెట్టి కమలనాథులతో పొత్తు
కుదుర్చుకోడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్లుగానే కనిపిస్తోంది. ఇవాళ అమిత్ షాతో
జరిపిన చర్చలు ప్రధానంగా సీట్ల సర్దుబాటు గురించే జరిగాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని
25 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లను పంచుకుంటాయని
తెలుస్తోంది. అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం 145, బీజేపీ జనసేన కలిపి
30 సీట్లలో పోటీ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఈ విషయమై
ఒకటిరెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
ఈ పొత్తు వల్ల ఏ పార్టీకి ఎంత ప్రయోజనం అని
చూస్తే… అన్నిరకాలుగానూ లాభపడేది తెలుగుదేశం పార్టీయే అన్న సంగతి సులువుగానే
తెలిసిపోతుంది. అలాగే అన్నిరకాలుగానూ నష్టపోయేది బీజేపీయే అన్న విషయమూ
స్పష్టమవుతోంది.
ముందు జనసేన సంగతి చూద్దాం. సినీనటుడు పవన్
కళ్యాణ్ పెట్టిన ఆ పార్టీ, ప్రస్తుతం అధికారికంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో
భాగస్వామిగా ఉంది. అలా ఉంటూనే తెలుగుదేశంతో ఏకంగా సీట్ల సర్దుబాటు కూడా
చేసేసుకుంది ఆ పార్టీ. చంద్రబాబునాయుడును రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు
చూడడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్, జైల్లోనుంచి బైటకు వస్తూనే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో
కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటన చేసేసారు. అప్పటినుంచి
ఇప్పటివరకూ మాట్లాడిన ప్రతీసారీ, జగన్‌ను గద్దె దించడానికి తెలుగుదేశాన్ని
అధికారంలోకి తీసుకొస్తామని చెబుతూనే ఉన్నారు. తాజాగా టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా
తమ పార్టీ 24 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించారు. ఒకవేళ
బీజేపీకి అనుకున్నదానికన్నా ఎక్కువ స్థానాలు కేటాయించాల్సి వస్తే అవి జనసేన
కోటాలోనుంచే ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారని సమాచారం.
ఇంక తెలుగుదేశం సంగతి చూస్తే… ఈ మొత్తం
వ్యవహారంలో మొదటినుంచీ మైండ్‌గేమ్ ఆడుతూ తాను అనుకున్న ఫలితం సాధించడంలో
చంద్రబాబునాయుడు విజయవంతమయ్యారనే చెప్పాలి. జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ఉందనీ, తమ పార్టీ గణనీయమైన మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమనీ ఆయన
చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే పొత్తులు కుదుర్చుకుంటున్నామంటున్న
చంద్రబాబు, మిగతా పార్టీల సంప్రదాయిక ఓటర్లను తెలుగుదేశం వైపు ఆకర్షించడానికే
ప్రయత్నిస్తున్నారు. అందుకే పేరుకి పొత్తు ఉన్నా, మూడొంతుల స్థానాలు తమ పార్టీకే
మిగుల్చుకున్నారు. పైగా, జనసేనకు కానీ బీజేపీకి కానీ ఓట్లు పెద్దగా లేవనీ, అందువల్ల
వారికి సీట్లు కేటాయించినా గెలవలేరనీ పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. అయితే ఓట్లు
లేని పార్టీలతో పొత్తులు దేనికి అని ప్రశ్నిస్తే నేరుగా జవాబుండదు. తెలుగుదేశానికి
బీజేపీతో పొత్తు కుదర్చడానికే జనసేనను వాడుకున్నారన్న విశ్లేషణలూ ఉన్నాయి.
చంద్రబాబు కానీ, పార్టీలోని పెద్ద నాయకులు కానీ నేరుగా బీజేపీని ఏమీ అనకపోయినా,
కిందిస్థాయి కార్యకర్తలు ఇప్పటికీ బీజేపీని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బీజేపీకి
రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్లు కూడా లేవనీ, అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ
ఎన్నికల సమయంలో జగన్‌కు సహకరిస్తే తమకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వారితోనూ
మిత్రత్వం నెరపాలనీ తెలుగుదేశం భావిస్తోంది. ఈ పొత్తు కుదిరినట్లే ఉంది కాబట్టి చంద్రబాబు
వ్యూహం ఫలించిందనే అనుకోవాలి. మరోవైపు, టికెట్ ఏ పార్టీకి కేటాయించినా, తమ
అభ్యర్ధులనే నిలబెడతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎలా చూసినా ఇది చంద్రబాబుకి ఉభయతారకమైన
పరిస్థితే.
ఇక బీజేపీ సంగతి చూద్దాం. ఒకప్పుడు 12 నుంచి
15శాతం వరకూ ఓట్లు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు నోటా కంటె తక్కువ ఓట్లకు
పరిమితమైన పార్టీగా కుదించుకుపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో
పార్టీ నామావశిష్టంగా మిగిలింది. 2014, 2019 ఎన్నికల తర్వాతైనా పార్టీని బలోపేతం చేసుకోవడంపై,
కనీసం సంస్థాగత నిర్మాణం చేసుకోవడంపై దృష్టి సారించలేదు. తమిళనాడులో అన్నామలై
స్థాయిలో కాకపోయినా, తెలంగాణలో బండి సంజయ్ స్థాయిలోనైనా ఒక్క నాయకుడినీ
తయారుచేసుకోలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బలం వల్ల ఆంధ్రలో ఏ పార్టీ
అధికారంలో ఉన్నా తమకు మద్దతిస్తున్నాయి కాబట్టి పని జరిగిపోతోంది తప్ప,
సొంతరెక్కలను బలపరచుకునేందుకు రాష్ట్ర బీజేపీ చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా బీజేపీ
తన అవసరం కోసమే తమతో పొత్తు కుదుర్చుకుంటోందంటూ తెలుగుదేశం కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో
విమర్శలు చేస్తున్నారు.
తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ ఒకవేళ ఒప్పుకోకపోయి
ఉంటే… అవినీతి నేత అయిన జగన్‌తో కుమ్మక్కయింది అని తెలుగుదేశం శ్రేణులు
విమర్శిస్తాయి. పొత్తుకు ఒప్పుకుంటే బీజేపీకి ఒక్క ఓటు కూడా తెచ్చుకునే దిక్కు
లేదు కాబట్టి తాము ఇచ్చిన సీట్లు తీసుకుంటుందనీ, అక్కడా ఆ పార్టీని తామే
గెలిపించాలనీ చెప్పుకుంటాయి. ఇలా, ఎటువైపు నుంచి చూసినా బీజేపీని ఓ అసమర్థ పార్టీగా
టీడీపీ శ్రేణులు చిత్రీకరిస్తాయి. అంతెందుకు, అమిత్ షా పిలిస్తేనే చంద్రబాబు
ఢిల్లీ వెళ్ళారు తప్ప తన అవసరం కోసం కాదంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో, కొన్ని
టీడీపీ అనుకూల ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఆ ప్రచారాన్ని
సమర్ధించడమో లేక ఖండించడమో కాదు, అసలు ఏమీ నోరెత్తి మాట్లాడే స్థితిలో రాష్ట్ర
బీజేపీ లేదు.
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి మరో
ప్రతికూలత కూడా ఉంది. ఆ పార్టీలో మహాశక్తివంతులుగా చెప్పుకునే నరేంద్రమోదీ, అమిత్
షాల కొమ్ములు చంద్రబాబు వంచేసారంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తాయి. దేశంలోకెల్లా
బలశాలి అయిన నరేంద్రమోదీని చంద్రబాబు ఒక్కరే నిలదీసారనీ, నిలువరించారనీ… అయినా
మళ్ళీ మోదీ బాబుతో పొత్తుకు తహతహలాడిపోయారనీ ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఊదరగొడుతున్నాయి.
అలాగే, కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా మీద టీడీపీ కార్యకర్తలు రాళ్ళు
రువ్వినప్పటికీ ఆయన ఏమీ చేయలేకపోయాడనీ, ఇప్పుడు తనే చంద్రబాబును పిలిపించుకుని తన
ఇంట్లోనే పొత్తుల గురించి అభ్యర్ధించాడనీ చెప్పుకుంటున్నాయి. 25 ఎంపీ సీట్లున్న
రాష్ట్రంలో, ఒక జాతీయ పార్టీ సొంతంగా ఎదగడానికి ప్రయత్నించకుండా, తమ పార్టీ మీద
ఆధారపడుతోందని కాలర్లు ఎగరేస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ
కూటమి ఓడిపోతే ఆ ఓటమిని బీజేపీ మీద తోసేయడానికి తెలుగుదేశం ఎంతమాత్రం వెనుకాడదు.
దక్షిణాదిలో తమ పార్టీ
ఎదగాలి, తమ కూటమి బలపడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన తప్ప, బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు
ఒప్పుకోడానికి కారణం కనిపించదు. 2014 నుంచి 2024 వరకూ పదేళ్ళపాటు ఎదగడానికి వచ్చిన
అవకాశాన్ని బీజేపీ వాడుకోలేకపోయింది.2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో
పొత్తు పెట్టుకున్నా, దానివల్ల లాభపడిందేమీ లేదు. ఇప్పుడు టీడీపీతో పొత్తు
కుదుర్చుకుంటే, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా ఎదిగే అవకాశాలు పూర్తిగా పోయినట్లే.
అలా, టీడీపీని ఎన్డీయేలోకి రానిచ్చినా బీజేపీకి నష్టమే తప్ప లాభమేమీ కనుచూపుమేరలో లేదు.