A Star from Another Sky Bibha Chowdhury
మహిళా దినోత్సవ ప్రత్యేకం : విభా చౌధురి
(1913-1991)
కణభౌతికశాస్త్రంలో కాస్మిక్ కిరణాల మీద అధ్యయనం
చేసి, పై-మెసాన్ అనే కొత్త సబ్ అటామిక్ పార్టికల్‌ను కనుగొన్న శాస్త్రవేత్త విభా
చౌధురి. ఆమె ఆ కణం ఉనికిని, డార్జిలింగ్‌లో చేసిన ప్రయోగాల్లో కనుగొంది. విభా
చాలాకాలం దేవేంద్ర మోహన్ బోస్ దగ్గర పనిచేసింది. ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత
పాట్రిక్ బ్లాకెట్తో కలిసి కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం కొనసాగించింది. భారత్
తిరిగి వచ్చాక న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పనిచేసింది. న్యూట్రినోలను కనుగొనడానికి
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్‌లో చేసిన ప్రయోగాల్లో విభా కూడా భాగస్వామిగా
ఉంది.
విభా చౌధురి తన డాక్టొరల్ స్టడీస్ కోసం కాస్మిక్
కిరణాల గురించి అధ్యయనం చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో, పాట్రిక్
బ్లాకెట్ ప్రయోగశాలలో చేరింది. ఆమె తన పిహెచ్డి కోసం ‘ఎక్స్టెన్సివ్ ఎయిర్
షవర్స్’ను అధ్యయనం చేసింది. బ్లాకెట్కు నోబెల్ బహుమతి రావడంలో విభా కృషి కూడా
ఉంది.
విభా చౌధురి తన ప్రయోగాల ద్వారా ‘పినట్రేటింగ్
ఈవెంట్స్ సాంద్రత, ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్లోని మొత్తం కణాల సాంద్రతకు
అనులోమానుపాతంలో ఉంటుంద’ని కనుగొంది. ‘మాంచెస్టర్ ఈవినింగ్ న్యూస్’ పత్రిక విభా
చౌధురిని ఇంటర్వ్యూ చేసి ‘భారతదేశపు కొత్త మహిళా శాస్త్రవేత్త’ పేరుతో
ప్రచురించింది.
పిహెచ్డి పూర్తిచేసాక విభా భారతదేశానికి తిరిగి
వచ్చి, టీఐఎఫ్ఆర్లో 8సంవత్సరాలు పనిచేసింది. 1954లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌కు
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉంది. అప్పట్లో హోమీ జహంగీర్ భాభా టీఐఎఫ్ఆర్ను ఇంకా
ఏర్పాటు చేస్తున్న దశలో, విభా థీసిస్ ఎగ్జామినర్స్‌ను వాకబు చేసి, వారి సిఫారసు
మేరకు ఆమెను తన బృందంలో చేర్చుకున్నారు. అనంతర కాలంలో విభా ఫిజికల్ రిసెర్చ్
ల్యాబొరేటరీలో చేరింది. అప్పుడే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన ప్రయోగాల్లో
తానూ పాల్గొంది. అలా న్యూట్రినో కణాలను కనుగొనడంలో విభా కూడా భాగస్వామి అయింది. ఆ
తర్వాత ఆమె కోల్‌కతాలో సాహా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పనిచేసింది.
ఆమె భౌతికశాస్త్రాన్ని ఫ్రెంచ్ భాషలో బోధించేది.
ఇటీవల ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ (ఐఏయూ)
అంతరిక్షంలోని తారలకు పేర్లు పెడుతోంది. అలా, తాము గుర్తించిన పసుపు-తెలుపు
రంగుల్లోని ఒక కుబ్జతార (డ్వార్ఫ్ స్టార్) హెచ్డి 86081కు విభా గౌరవార్ధం ఆమె
పేరు పెట్టింది.
విభా చౌధురి 1991లో
మరణించేవరకూ తన పరిశోధనల విషయాలను ప్రచురిస్తూనే ఉంది. ఆమె జీవిత గాధ ‘ఎ జువెల్
అన్‌ఎర్త్‌డ్ : విభా చౌధురి’ అన్న పేరుతో ప్రచురితమైంది.