Algebra is on her finger tips, Raman Parimala
మహిళా దినోత్సవ ప్రత్యేకం : రామన్ పరిమళ (1948)
భారత ప్రభుత్వం ఇటీవల మహిళా శాస్త్రవేత్తల పేరిట
చైర్స్ ఏర్పాటు చేసిన జాబితాలో సజీవంగా ఉన్న ఒకే ఒక్క శాస్త్రవేత్త రామన్ పరిమళ.
బీజగణితం (ఆల్జీబ్రా)లో ఆమె చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా మెప్పు పొందింది.‘నాన్
ట్రివియల్ క్వాడ్రాటిక్ స్పేస్ ఓవర్ ఏన్ అఫైన్ ప్లేన్’కు మొట్టమొదటి ఉదాహరణను
రామన్ పరిమళే కనుగొని, ప్రదర్శించి, ప్రపంచవ్యాప్తంగా గణితవేత్తలను
ఆశ్చర్యచకితులను చేసింది. రామన్ పరిమళ నెంబర్ థియరీ, ఆల్జీబ్రాయిక్ జామెట్రీ,
టోపోలజీ రంగాల్లో స్పెషలైజేషన్ చేసింది. సెకెండ్ సెర్రే కంజెక్చర్కు పరిమళ
కనుగొన్న పరిష్కారం, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
బీజగణితంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ
గణితవేత్త రామన్ పరిమళ ఎమొరీ యూనివర్సిటీలో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్. ఆమె
సుదీర్ఘకాలం ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రిసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా
పనిచేసింది.
పరిమళ గణిత రచనల్లో ‘ఫెయిల్యూర్ ఆఫ్ ఎ
క్వాడ్రాటిక్ అనలాగ్ ఆఫ్ సెర్రేస్ కంజెక్చర్’, ‘క్వాడ్రాటిక్ స్పేసెస్ ఓవర్
పాలీనామియల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ రెగ్యులర్ రింగ్స్ ఆఫ్ డైమెన్షన్ 2’, ‘గాలోయిస్
కొహొమోలజీ ఆఫ్ ది క్లాసికల్ గ్రూప్స్ ఓవర్ ఫీల్డ్స్ ఆఫ్ కొహొమొలోజికల్ డైమెన్షన్’
ప్రముఖమైనవి.
1994లో జూరిచ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్
ఆఫ్ మేథమేటిక్స్‌లో పరిమళ ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొని ‘స్టడీ ఆఫ్
క్వాడ్రాటిక్ ఫామ్స్ : సమ్ కనెక్షన్స్ విత్ జామెట్రీ’ అనే అంశంపై సోదాహరణంగా
ప్రసంగించింది. 2010లో హైదరాబాద్‌లో గణిత కాంగ్రెస్ సమావేశంలో ‘అరిత్మెటిక్ ఆఫ్
లీనియర్ ఆల్జీబ్రాయిక్ గ్రూప్స్ ఓవర్ టూడైమెన్షనల్ ఫీల్డ్స్’ అనే అంశంపై
ప్రసంగించింది. 2020లో నేషనల్ సైన్స్ డే నాడు భారత ప్రభుత్వం రామన్ పరిమళ పేరిట ఒక
చైర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
రామన్ పరిమళ 1987లో శాంతిస్వరూప్ భట్నాగర్
అవార్డ్ గెలుచుకుంది. 1999లో లసానే యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
చేసింది. 2003లో శ్రీనివాస రామానుజన్ బర్త్ సెంటినరీ అవార్డ్‌తో పరిమళను
గౌరవించారు. 2005లో టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వరించింది. ఇంక ఆమెకు ఇండియన్ అకాడెమీ
ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ, అమెరికన్ మేథమెటికల్ సొసైటీ వంటి
పలు సంస్థలు ఫెలోషిప్ ప్రకటించాయి.