First Indian Anthropologist Iravati Karve
మహిళా దినోత్సవ ప్రత్యేకం
: ఇరావతీ కర్వే (1905-1970)
ఇరావతీ కర్వే భారతదేశపు మొట్టమొదటి
మహిళా ఆంత్రొపాలజిస్ట్. నిజానికి అప్పట్లో సోషియాలజీ, ఆంత్రొపాలజీ కలిసి ఉండేవి.
ఆమె ఇండాలజీ, పేలియాంటాలజీ, ఆంత్రోపొమెట్రీ, సీరాలజీల్లో నిపుణురాలు. మహిళా విద్య
కోసం ఇరావతీ కర్వే ఎంతో కృషి చేసింది.
ఇరావతి 1931 నుంచి 1936
వరకూ బొంబాయిలో ఎన్ఎన్డిటి మహిళా విశ్వవిద్యాలయం నిర్వాహకురాలిగా పనిచేసింది.
బొంబాయిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో అధ్యాపకురాలిగానూ పనిచేసింది. 1939లో
పుణేలోని డెక్కన్ కళాశాలలో సోషియాలజీ రీడర్‌గా చేరి, అక్కడే తన కెరీర్ పూర్తి
చేసింది.
ఇరావతీ కర్వే పూనా
యూనివర్సిటీలో ఆంత్రొపాలజీ విభాగాన్ని ప్రారంభించింది. తర్వాత డెక్కన్ కాలేజీలో
డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అండ్ ఆంత్రొపాలజీకి చాలాయేళ్ళు విభాగాధిపతిగా
పనిచేసింది. 1947లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ఆంత్రొపాలజీ
డివిజన్‌కు అధ్యక్షత వహించింది. ఆమె మరాఠీ, ఆంగ్లభాషల్లో విస్తృతంగా రచనలు
చేసింది.
మానవ సంబంధాల మీద ఇరావతీ కర్వే చేసిన పరిశోధనలకు ఆంత్రొపోమెట్రిక్ సర్వేలు,
భాషా సంబంధిత సర్వేలను ప్రాతిపదికగా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ సర్వేలను
ప్రామాణికంగా గుర్తించడం లేదు. అయినప్పటికీ పర్యావరణం మీద, మహారాష్ట్ర సంస్కృతి
మీద ఇరావతీ కర్వే పరిశీలనలు నేటికీ విద్యావ్యవస్థల్లో ఆసక్తి కలగజేస్తూనే ఉన్నాయి.