Doctor cum Freedom Fighter Kadambini Ganguly
మహిళా దినోత్సవ ప్రత్యేకం : కాదంబినీ గంగూలీ (1861-1923)
ఆధునిక వైద్యశాస్త్రంలో
శిక్షణ పొందిన మొదటి ఇద్దరు భారతీయ మహిళా వైద్యుల్లో కాదంబినీ గంగూలీ ఒకరు. ఒక్క
భారతదేశంలోనే కాదు, దక్షిణాసియా మొత్తంలో ఆమె రెండవ వైద్యురాలు. ఏ రంగంలోనైనా
తొలిదశలో ఉండే మహిళలు ఎదుర్కొనే వివక్ష, అవమానాలను కాదంబిని కూడా ఎదుర్కొంది.
డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, కాదంబిని రాజకీయంగా కూడా క్రియాశీలంగా
ఉండేది. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామంలో
పాల్గొంది. బెంగాల్ విభజన తర్వాత 1906లో సత్యాగ్రహ సమావేశాలు నిర్వహించింది.
తూర్పు భారతదేశంలో బొగ్గుగనుల్లో పనిచేసే మహిళా కూలీల స్థితిగతులను మెరుగుపరచడానికి
నిర్విరామంగా కృషి చేసింది.
కాదంబిని 1892లో యుకె
వెళ్ళింది. ఎడింబర్గ్‌లో ఎల్ఆర్సీపీ, గ్లాస్గోలో ఎల్‌ఆర్‌సీఎస్, డబ్లిన్‌లో జీఎఫ్పీఎస్
కోర్సుల్లో ఉత్తీర్ణురాలై, ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యురాలిగా భారతదేశానికి
తిరిగివచ్చింది. కొంతకాలం లేడీ డఫెరిన్ హాస్పిటల్లో పనిచేసాక, సొంతంగా ప్రాక్టీస్
ప్రారంభించింది.
కాదంబినీ గంగూలీ తూర్పుభారతదేశంలోని బొగ్గుగనుల్లో మహిళల ఉద్ధరణ కోసం
పనిచేసింది. వారికి దాస్య విముక్తి కోసం, వారి పని పరిస్థితులు మెరుగుపరచడం కోసం
కృషి చేసింది. 1889లో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ సమావేశాలకు హాజరైన
ఆరుగురు మహిళా డెలిగేట్లలో కాదంబిని ఒకరు. అంతేకాదు, బెంగాల్ విభజన తర్వాత జరిగిన
పరిణామాల్లో ఆవిడ 1906లో కలకత్తాలో మహిళా సదస్సు నిర్వహించారు. అలాగే 1908లో,
దక్షిణాఫ్రికాలోని భారతీయ కూలీల సత్యాగ్రహంతో ప్రేరణ పొంది వారికి మద్దతుగా కలకత్తాలో
తన అధ్యక్షతన ఒక సమావేశాన్ని నిర్వహించింది. రోజుకూలీ మీద బతికే కార్మికులు,
శ్రామికుల కోసం నిధులు వసూలు చేసి, వారి సంక్షేమానికి ఖర్చు పెట్టేందుకు ఒక
సంఘాన్ని ఏర్పాటు చేసింది.