Awesome Organic Chemist Asima Chatterjee
మహిళా దినోత్సవ ప్రత్యేకం : ఆసిమా ఛటర్జీ
(1917-2006)
మలేరియా నివారణకు,
ఎపిలెప్సీ నివారణకు, కీమోథెరపీకి మందులు తయారుచేసిన గొప్ప ఆర్గానిక్ కెమిస్ట్
ఆసిమా ఛటర్జీ. భారత ఉపఖండంలో లభించే ఔషధ మొక్కల గురించి ఆమె విస్తృతంగా పరిశోధన
చేసింది. క్యాన్సర్ చికిత్సలో, రోగకణాలు పెరిగిపోకుండా నివారించే కీమోథెరపీలో
ఉపయోగించే ఆల్కలాయిడ్స్ గురించి ఆమె దాదాపు యాభైఏళ్ళు పరిశోధనలు చేసింది.
సైన్స్‌లో డాక్టరేట్
సాధించిన మొట్టమొదటి భారతీయ వనిత ఆసిమా ఛటర్జీ. కెమిస్ట్రీ ఆఫ్ ప్లాంట్
ప్రొడక్ట్స్, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆమె డాక్టొరల్ రిసెర్చ్ చేసింది.
ప్రఫుల్ల చంద్ర రాయ్, సత్యేంద్రనాథ్ బోస్ వద్ద ఆమె అధ్యయనం చేసింది. ఆ తర్వాత
యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మేడిసన్ అండ్ కాల్టెక్‌లో ఆసిమా పరిశోధనలు
కొనసాగించింది.
ఆసిమా ఛటర్జీ పరిశోధన
నేచురల్ ప్రోడక్ట్స్ కెమిస్ట్రీ కేంద్రంగా సాగింది. మలేరియా, ఎపిలెప్సీ నివారణకు
వాడే మందులు, కీమోథెరపీలో ఉపయోగించే మందులు ఆసిమా పరిశోధనల ఫలితమే. ఆల్కలాయిడ్
సంయోగ పదార్ధాలపై ఆమె నలభై ఏళ్లకు పైగా పరిశోధనలు చేసింది. వాటి ఆధారంగానే
ఎపిలెప్సీకి ఉపయోగిస్తున్న ఆయుష్-56 అనే మందు, మలేరియా చికిత్సకు వాడే మందులను
కనుగొన్నారు.
ఆసిమా ఛటర్జీ 1961లో రసాయనశాస్త్రంలో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గెలుచుకున్నారు.
ఆ పురస్కారం పొందిన మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త ఆసిమాయే.1975లో భారత ప్రభుత్వం
ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. అదే యేడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
అసోసియేషన్‌కు జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. ఆ పదవి పొందిన మొట్టమొదటి మహిళా
శాస్త్రవేత్త ఆసిమాయే. ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు ఆసిమాకు గౌరవ
డాక్టరేట్లు ప్రదానం చేసాయి. భారత రాష్ట్రపతి ఆమెను 1982 ఫిబ్రవరి నుంచి మే 1990
వరకూ రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేసారు.