Fiercely Independent Organic Chemist
మహిళా దినోత్సవ ప్రత్యేకం : దర్శన్ రంగనాథన్ (1941-2001)
బయో ఆర్గానిక్ కెమిస్ట్రీలో తన పరిశోధనలకు గాను ప్రపంచ ఖ్యాతి
గడించిన శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్. ప్రకృతిలో సహజసిద్ధంగా చోటుచేసుకునే జైవిక
స్పందనలను ప్రయోగశాలలోనే పునఃసృష్టించడంలో ఆమె స్పెషలైజేషన్ చేసింది. రసాయనశాస్త్రంలో ప్రొటీన్లు, ఇతర నానో
నిర్మాణాల ప్రాధాన్యతను నిర్ధారించడంలోనూ ఆమె గొప్ప నిపుణురాలు.
దర్శన్ రంగనాథన్ 1967లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో
రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. ఢిల్లీలోని మిరాండా కాలేజ్‌లో రసాయనశాస్త్ర
విభాగానికి హెచ్ఓడీగా పనిచేసింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో రాయల్ కమిషన్ ఫర్ ది ఎగ్జిబిషన్లో తన పరిశోధనకు
రిసెర్చ్ ఫెలోషిప్ అందుకుంది. దానివల్ల
ఇంపీరియల్ కాలేజ్‌లో పోస్ట్ డాక్టొరల్ వర్క్ చేయగలిగింది.
దర్శన్ రంగనాథ్ 1970లో ఐఐటీ కాన్పూర్‌లో పరిశోధన
ప్రారంభించింది. ఆ యేడాదే సహ శాస్త్రవేత్త సుబ్రమణియన్ రంగనాథన్‌ను పెళ్ళి
చేసుకుంది. వారిద్దరూ కలిసి పలు శాస్త్రీయ రచనలు చేసారు, మరెన్నో పుస్తకాలను ఎడిట్
చేసారు.
దర్శన్ రంగనాథన్‌కు రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లు
1997లో వెల్లడైంది. 2001లో తన 60వ పుట్టినరోజు నాడే ఆమె తుదిశ్వాస విడిచింది.
అప్పటికి ఆమె మనదేశంలోనే అత్యుత్తమ ఆర్గానిక్ కెమిస్ట్‌గా పేరు గడించింది. దర్శన్,
ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి సుమారు 50 పరిశోధక వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో
ప్రచురించింది. మరెన్నో పరిశోధక వ్యాసాలు ఆమె మరణం తర్వాత ప్రచురితమయ్యాయి.
దర్శన్ రంగనాథన్ ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్
ఫెలోషిప్‌కు ఎన్నికైంది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ ఫెలోషిప్ పొందింది.
బయోఆర్గానిక్ కెమిస్ట్రీలో సూపర్ మోలిక్యులర్ అసెంబ్లీస్, మోలిక్యులర్ డిజైన్,
వివిధ జైవిక ప్రక్రియల కెమికల్ సిమ్యులేషన్, సింథసిస్ ఆఫ్ హైబ్రిడ్ పెప్టైడ్స్,
సింథసిస్ ఆఫ్ నానోట్యూబ్స్ వంటి పరిశోధనలు ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి
తెచ్చిపెట్టాయి. ఆ పరిశోధనలకు గాను 1999లో దర్శన్ రంగనాథన్ రసాయనశాస్త్రంలో ‘ది థర్డ్
వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్’ పురస్కారం గెలుచుకుంది. ఇంకా ఎ.వి,రామారావు ఫౌండేషన్
అవార్డ్, జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటినరీ విజిటింగ్ ఫెలోషిప్, సుఖదేవ్ ఎండోమెంట్
లెక్చర్‌షిప్ వంటి పురస్కారాలు గెలుచుకుంది.
2001లో దర్శన్ మరణం
తర్వాత ఆమె భర్త ఆమె పేరిట ‘ప్రొఫెసర్ దర్శన్ రంగనాథన్ మెమోరియల్ లెక్చర్’
ప్రారంభించారు. రెండేళ్ళకోసారి జరిగే ఆ కార్యక్రమంలో శాస్త్రసాంకేతిక రంగాల్లో
గణనీయమైన కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలను సత్కరిస్తారు.