Archana Sharma : The Indian Pioneer in Cytogenetics
మహిళా దినోత్సవ ప్రత్యేకం: అర్చనా
శర్మ (1932-2008)
అర్చనా శర్మ ప్లాంట్ జెనెటిక్స్‌లో స్పెషలైజేషన్ చేసిన
వృక్షశాస్త్రజ్ఞురాలు. మొక్కల్లో లింగవిభజన లేని మొక్కల గురించి ఆమె పరిశోధనలు
అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. లింగ విభజన లేని మొక్కలు ఒక ప్రత్యేకమైన జాతిగా ఎలా పరిణామం
చెందాయన్న విషయంపై అర్చన అధ్యయనం చేసింది. జీవకణాలు, వాటి సాధారణ లక్షణాలు, వాటి
జన్యు లక్షణాల గురించి ప్రత్యేక అధ్యయనం చేసింది. అర్చన పరిశోధనల్లో… అడల్ట్ న్యూక్లియస్‌లో
కణవిభజన జరిగే విధానం, మానవ జనాభాలో జెనెటిక్ పోలీమార్ఫిజమ్, నీటిలో ఆర్సెనిక్
ప్రభావం… ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. అయితే, పూలు పూసే మొక్కలను క్రోమోజోముల
ఆధారంగా వర్గీకరించిన పరిశోధన అర్చనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.
అర్చనాశర్మ 1967లో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో అధ్యాపకురాలిగా
చేరింది. 1972లో అదే విశ్వవిద్యాలయంలో జీవకణాలు, క్రోమోజోములపై అధ్యయనకేంద్రంలో
జెనెటిక్స్ ప్రొఫెసర్ బాధ్యతలు చేపట్టింది. 1981 నుంచి 1983 వరకూ ఆ
విశ్వవిద్యాలయంలో బోటనీ డిపార్ట్మెంట్కు హెచ్ఓడీగా పనిచేసింది.
అర్చన విద్యావేత్తగా 70కి పైగా పరిశోధక
విద్యార్ధులకు సైటోజెనెటిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్
మ్యుటాజెనెసిస్ అంశాల్లో మార్గదర్శనం చేసింది. ఆమె యూజీసీ, జాతీయ మహిళా కమిషన్,
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిసెర్చ్ కౌన్సిల్ వంటి పలు సంస్థల్లో సభ్యురాలిగా శాస్త్ర
పరిశోధనలకు ప్రోత్సాహమిచ్చింది.
కేంద్రప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ‘టాస్క్‌ఫోర్స్ ఆన్
ఇంటిగ్రేటెడ్ మ్యాన్‌పవర్ డెవలప్మెంట్’కు చైర్‌పర్సన్‌గా సేవలందించింది. ఆవిడ
సుమారు 400 పరిశోధనా పత్రాలు, 10 పుస్తకాలూ ప్రచురించింది. భారతదేశంతో పాటు
అమెరికా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చెందిన శాస్త్రీయ గ్రంథాల
ప్రచురణసంస్థలకు ఎడిటర్‌గా పనిచేసింది.
అర్చనా శర్మ 1995లో జిపి
ఛటర్జీ పురస్కారం, ఎస్జి సిన్హా అవార్డ్ గెలుచుకుంది. 1984లో పద్మభూషణ్ పురస్కారం
పొందింది. 1984లో బీర్బల్ సాహ్నీ మెడల్, 1983లో ఫిక్కి అవార్డ్, 1977లో ఇండియన్
అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్, 1975లో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్, 1972లో
జగదీష్ చంద్రబోస్ అవార్డ్ గెలుచుకుంది.