Internationally Acclaimed Indian Woman Botanist
మహిళా దినోత్సవ ప్రత్యేకం : జానకీ అమ్మాళ్ (1897-1984)
కేరళలో పుట్టిన జానకీ అమ్మాళ్, అమెరికాలో బోటనీలో
పీహెచ్డీ సాధించిన మొదటి మహిళ. ఆమె చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, డీఎస్సీ
అనే గౌరవ పట్టాతో సత్కరించిన అతికొద్దిమంది ఆసియా మహిళల్లో ఆమె ఒకరు. అమెరికాలోని
ఏన్ ఆర్బర్‌లో ఆమె వృక్షశాస్త్ర విభాగంలో పనిచేసింది. భారత్ వచ్చేసాక మద్రాస్ వద్ద
మదురవోయల్ వద్ద కేంద్రప్రభుత్వపు ఫీల్డ్ ల్యాబొరేటరీలో తను చనిపోయేంతవరకూ, అంటే
1984 ఫిబ్రవరి వరకూ పనిచేసింది. ఒక జెనెటిసిస్ట్గా జానకీ అమ్మాళ్ ఎన్నో సంకర
జాతుల వంగడాలను సృష్టించింది. అమ్మాళ్ జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్ఠాత్మక
పదవుల్లో ఉన్నతస్థాయి సేవలు అందించింది. అలహాబాద్ సెంట్రల్ బొటానికల్ ల్యాబొరేటరీకి
డైరెక్టర్‌గానూ. జమ్మూలోని ప్రాంతీయ
పరిశోధనా కార్యాలయంలో ప్రత్యేక అధికారిణిగానూ పనిచేసింది. తర్వాత ట్రాంబేలోని భాభా
అటామిక్ రిసెర్చ్ సెంటర్లోనూ విధులు నిర్వహించింది. చివరిగా మద్రాస్ యూనివర్సిటీ
వృక్షశాస్త్ర విభాగంలో ఎమిరెటస్ సైంటిస్ట్‌గా 1970 నవంబర్‌లో పనిచేసింది.
జీవితాంతం అక్కడే స్థిరపడిపోయింది.
1939-50 వ్యవధిలో ఆమె అమెరికాను సందర్శించింది.
ఉద్యానవన పంటల్లో క్రోమోజోములపై పరిశోధించింది, ఆ పరిశోధనలు జీవుల పరిణామక్రమాన్ని
విస్తృతంగా వివరిస్తాయి. 1945లో ఆమె రాసిన ‘ది క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్
ప్లాంట్స్’ ఆ రంగంలో బహుళ ఆదరణ పొందిన సంశోధిత రచన. మద్రాస్‌లోని సెంటర్ ఆఫ్
అడ్వాన్స్డ్ స్టడీ ఫీల్డ్ ల్యాబొరేటరీలో వైద్యగుణాలున్న మొక్కలతో ఉద్యానవనాన్ని
అభివృద్ధి చేసింది. సైటాలజీ – జీవకణ పరిణామ శాస్త్రంలో కూడా ఆమె విశేష కృషి
చేసింది.
జానకీ అమ్మాళ్ 1935లో ఇండియన్
అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌లో ఫెలోషిప్, 1957లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ ఫెలోషిప్
పొందింది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ఆమెకు 1956లో ఎల్ఎల్డి గౌరవ పట్టా ప్రదానం
చేసింది. భారత ప్రభుత్వం ఆమెకు 1977లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
భారతదేశపు పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2000 సంవత్సరంలో జానకీ అమ్మాళ్ పేరిట
టాక్సానమీలో జాతీయ అవార్డు ఏర్పాటు చేసింది.