The Great Women Scientistsof India
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేకం)
స్త్రీని గౌరవించడం మన సంప్రదాయం. దాన్ని
పునరుద్ఘాటించేలా భారతదేశ ప్రభుత్వం వివిధ రంగాల్లోని మహిళా శాస్త్రవేత్తల పేరిట
11 చైర్స్ ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనా రంగాల్లో మహిళల సాధికారతకు చిహ్నంగా,
వారికి ప్రోత్సాహకంగా, యువ మహిళా పరిశోధకులకు ప్రేరణ కలిగించడానికి, వారి సేవలను
గుర్తించడానికీ మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇమ్యునాలజీ, ఫైటోమెడిసిన్,
బయోకెమిస్ట్రీ, వైద్యం, సోషల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అండ్ మెటిరాలజీ,
ఇంజనీరింగ్, గణితం, భౌతికశాస్త్రం… అనే పదకొండు అంశాల్లో ప్రాథమిక పరిశోధనల్లో
భారతీయ మహిళా శాస్త్రవేత్తల సేవలను ప్రపంచానికి చాటిచెప్పడానికే ఈ చైర్స్ను
కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల
సేవలు ఘనమైనవే అయినప్పటికీ, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్
– ఎస్టీఈఎం) రంగాల్లో మహిళలు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు.
నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం
భారతదేశంలో స్టెమ్ రంగాల్లో మహిళా ఉద్యోగులు కేవలం 14శాతం మాత్రమే ఉన్నారు. అలాగే,
ఆయా రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారిలో మహిళలు 35శాతం మాత్రమే ఉండడం
గమనార్హం. భారతదేశపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి పరిమితంగా ఉందని ఈ
గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ ఆయా రంగాల్లో వారు అద్భుతమైన విజయాలు
సాధిస్తూ విద్యార్ధినులకు, యువతులకు ప్రేరణగా నిలుస్తున్నారు.
అలాంటి మహిళా మూర్తుల్లో
ఆదర్శప్రాయులైన 11మంది పేరిట మన ప్రభుత్వం 11 చైర్స్ ఏర్పాటు చేసింది. రిసెర్చ్,
అకడమిక్ రంగాల్లో మహిళలకు ప్రేరణ కలిగించడమే ఈ చైర్స్ లక్ష్యం. వాటికి ఆదర్శంగా
తీసుకున్న మహిళా మూర్తులు జానకీ అమ్మాళ్, అర్చనా శర్మ, దర్శన్ రంగనాథన్, ఆసిమా
ఛటర్జీ, కాదంబినీ గంగూలీ, ఇరావతీ కర్వే, అన్నామణి, రాజేశ్వరీ ఛటర్జీ, రామన్ పరిమళ,
విభా చౌధురి, కమల్ రణదివే. వారి స్ఫూర్తితో నవతరం మహిళలు శాస్త్రసాంకేతిక రంగాల్లో
భారతమాత కీర్తిపతాకాన్ని ఎగరేయాలి.