నైజీరియాలో సాయుధ ముఠాలు చెలరేగిపోయాయి. ఓ పాఠశాలపై దాడిచేసిన దుండగులు, దాదాపు 280 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని చికున్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా విద్యార్థులను కిడ్నాప్ చేయడం ఆందోళన రేపుతోంది.
కురిగాలోని ఓ బడిలోకి గురువారం సాయుధ ముఠాల గుంపు ప్రవేశించింది. గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి వారిని భయబ్రాంతులకు గురిచేశారు. కొందరు విద్యార్థులు కాల్పుల మోత విని తప్పించుకున్నారు. మొత్తం రెండు పాఠశాలల్లో 280 మందిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ జరిగినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
నైజీరియాలో పాఠశాలలపై బందిపోట్లు దాడిచేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. కిడ్నాప్ చేసి భారీగా నగదు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇటీవల తగ్గుముఖం పట్టినా, మరలా బందిపోట్లు చెలరేగిపోయారు. నైజీరియాలోని వాయువ్య అటవీ ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని బందిపోట్లు చెలరేగిపోతుంటారని తెలుస్తోంది.