టీచర్స్ నియామకాల్లో అక్రమాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే అనుమానంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పశ్చిమబెంగాల్‌లోని ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన ప్రసన్న కుమార్ రాయ్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ చటర్జీకి ప్రసన్న కుమార్ రాయ్ అత్యంత సన్నిహితుడుగా గుర్తించారు. ఇప్పటికే మాజీ మంత్రి పార్థ చటర్జీ జుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
పతార్‌ఘట్ట న్యూ సిటీ ప్రాంతంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఉపాధ్యాయ పోస్టుల అక్రమ నియామకాల్లో మధ్యవర్తుల ఇళ్లు, కార్యాలయాలు లక్ష్యంగా ఈ దాడులు జరుపుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జనవరి నెలలో ఈడీ, బెంగాల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ప్రసన్నకుమార్‌కు చెందిన రెండు విలాసవంతమైన బంగ్లాల్లో సోదాలు జరుపుతున్నారు. మాజీ మంత్రి పార్థ చటర్జీ నుంచి సీబీఐ అధికారులు ఇప్పటికే రూ.21 కోట్ల అక్రమంగా దాచిన నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలసిందే.