మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు
భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాల పరిసరాలు మార్మోగుతున్నాయి.
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండగగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు
తరలివచ్చారు.
వేకువజాము నుంచే అర్ధనారీశ్వరుడిని భక్తులు దర్శించుకుని
అనుగ్రహం పొందుతున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ కిలోమీటరు మేర ఉండగా, ప్రసాద విక్రయ
కౌంటర్ల వద్ద కూడా విపరీతమైన రద్దీ నెలకొంది.
నేటి సాయంత్రం ఆదిదంపతులకు ప్రభోత్సవం
నిర్వహించి, రాత్రి 7 గంటలకు
నంది వాహన సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు
రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
రాత్రి 10 నుంచి 12 గంటల వరకు కీలకఘట్టమైన పాగాలంకరణ ఉంటుంది. విమానగోపురానికి, ముఖమండప నందులకు పాగాలంకరణ చేయనున్నారు. రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు
కళ్యాణం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నవవాహ్నిక దీక్షతో
పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామి అమ్మవార్లు గజవాహనంపై విహరించి
భక్తులను కటాక్షించారు.