ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ(డీఆర్)ని పెంచింది. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది వారికి అదనంగా రూ.12869 కోట్లు చెల్లిస్తారు.
ఉద్యోగుల మూల వేతనంలో 46 శాతం ఉన్న డీఏ 4 శాతం పెరగడంలో అది 50 శాతానికి చేరింది. అద్దె భత్యం 27, 18, 9 శాతం నుంచి 30, 20, 10 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు 25 శాతం పెరగనున్నాయి. ఈ నిర్ణయాల వల్ల కేంద్రంపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల భారం పడనుంది.