మహిళా దినోత్సవం సదర్భంగా ప్రధాని మోదీ తీపి కబురు అందించారు. వంట గ్యాస్ సిలిండర్‌పై వంద రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల 30 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ప్రభుత్వంపై ఏటా రూ.12000కోట్ల భారం పడుతుంది.ఈ నిర్ణయం నారీశక్తికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
వంట గ్యాస్ ధర తగ్గించడం వల్ల కుటుంబాలపై భారం తగ్గి, వారి శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. గ్యాస్ ధరలు తగ్గించడం ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించినట్లవుతుందన్నారు. మహిళల సులభతర జీవనం,వారి సాధికారతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని ఉజ్వల యోజన పథకం కింద 3 కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కో సిలిండర్‌కు రూ.300 రాయితీ అందిస్తున్నారు. దీన్ని వచ్చే మార్చి చివరి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షాబంధన్ పురస్కరించుకుని గత ఏడాది ఒక్కో సిలిండర్‌కు రూ.200 తగ్గించిన సంగతి తెలిసిందే.