Students asked to bring answer sheets to write exams
విద్యా సంవత్సరం చివరికి వస్తోంది. దేశవ్యాప్తంగా
పరీక్షల హడావుడి మొదలైంది. సరిగ్గా ఇలాంటి సమయంలో కర్ణాటకలో సిద్దరామయ్య
నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఉత్తర్వు జారీ చేసింది. అదేంటంటే….
5,8,9 తరగతులు చదివే పిల్లలు పరీక్షలు రాయడానికి తామే తెల్లకాగితాలు తెచ్చుకోవాలి.
ఆ మేరకు అన్ని పాఠశాలల యాజమాన్యాలకూ ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటక డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
అండ్ లిటరసీ (డీఎస్ఈఎల్) ఒక ప్రకటన చేసింది, 5,8,9 తరగతుల బోర్డు పరీక్షలకు తమ
విభాగం ప్రశ్నాపత్రాలను మాత్రమే సరఫరా చేస్తుంది. ఆన్సర్ షీట్లు మాత్రం విద్యార్ధులే
తెచ్చుకోవాలి. అంతేకాదు, జవాబు పత్రాల మూల్యాంకనం బ్లాక్ స్థాయిలో జరుగుతుంది.
డీఎస్ఈఎల్ 2022-23 విద్యాసంవత్సరం నుంచీ 5,8
తరగతులకు, ప్రస్తుత 2023-24 విద్యాసంవత్సరం నుంచీ 9వ తరగతికి బోర్డు పరీక్షలు
నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు మార్చి 11 నుంచి 18వరకూ నిర్వహించాలని కర్ణాటక స్టేట్
ఎగ్జామినేషన్ బోర్డ్ ఆదేశించింది.
పరీక్ష రాసే విద్యార్ధులకు ప్రశ్నాపత్రంతో పాటు
జవాబులు రాసేందుకు ఆన్సర్ షీట్లు కూడా ఇవ్వడంఎక్కడైనా
ఏ రాష్ట్రంలోనైనా సాధారణంగా పాటించే పద్ధతి. డీఎస్ఈఎల్ గతేడాది పరీక్షలు
నిర్వహించినప్పుడు ఆ పద్ధతినే అనుసరించింది. కానీ ఈ యేడాది పరిస్థితి మారిపోయింది.
ప్రశ్నపత్రంతో పాటు విద్యార్ధి గురించిన సమాచారాన్ని నింపడానికి ఒక కాగితం మాత్రమే
ఇస్తామనీ, జవాబులు రాయడానికి కాగితాలు పిల్లలే తెచ్చుకోవాలనీ నిర్దిష్టంగా
ఆదేశించారు. అంతేకాదు, డిపార్ట్మెంట్ అధికారులు గతవారం రాష్ట్రంలోని హైస్కూళ్ళ
హెడ్మాస్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, విద్యార్ధులకు ఆన్సర్ షీట్లు తెచ్చుకోవాలన్న
విషయాన్ని గుర్తుచేయమని కూడా ఆదేశించారు. ఇంకా విచిత్రం ఏంటంటే, విద్యార్ధులందరూ
ఒకేలా ఉండే ఆన్సర్ షీట్లు తెచ్చుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసారు.
ఈ ఉత్తర్వులను అందరూ వ్యతిరేకిస్తున్నారు.
టీచర్లు, తల్లిదండ్రులు, స్కూల్ డెవలప్మెంట్ మోనిటరింగ్ కమిటీలు అందరినీ ప్రభుత్వ
ఆదేశాలు ఆశ్చర్యానికి గురిచేసాయి. అసలు రాష్ట్రంలోని విద్యార్ధులందరూ ఒకేలాంటి
ఆన్సర్ షీట్లు ఎలా తెచ్చుకోగలుగుతారంటూ విమర్శించారు.
అయితే 5,8,9 తరగతులకు బోర్డ్ ఎగ్జామ్స్
నిర్వహించకూడదంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఆ పరీక్షలు రద్దయ్యాయి.
ఏదేమైనా పరీక్షలు రాయడానికి కాగితాలు తెచ్చుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించడం
విద్యావ్యవస్థకే సిగ్గుచేటు.
బీజేపీ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ
అధ్యక్షుడు తేజస్వి సూర్య ఈ ఉత్తర్వులపై విరుచుకు పడ్డారు. ‘‘రాష్ట్రంలో పరిపాలన
మొత్తం గందరగోళంగా తయారైంది. ఈ ప్రభుత్వం అధికారంలో చూపాల్సిన హుందాతనాన్ని కోల్పోయింది.
కర్ణాటకను దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పిల్లలను తమ పరీక్షల కోసం
తమనే జవాబుపత్రాలు తెచ్చుకోమని ఆదేశించేంతగా దిగజారిపోయింది’’ అని మండిపడ్డారు.