Calcutta High Court Former Judge Joins BJP
మరికొద్ది వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న
తరుణంలో, పశ్చిమబెంగాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు ధోరణి ప్రదర్శిస్తోంది. మమతా
బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలతో విసిగిపోయిన బెంగాలీలకు
బీజేపీయే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా
పనిచేసిన అభిజిత్ గంగోపాధ్యాయ కమలదళంలో చేరారు.
ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ బెంగాల్లో
పోరాడవలసింది అవినీతి పైనే అని స్పష్టం చేసారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో
కూరుకుపోయిందనీ, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. సందేశ్‌ఖాలీ
ఘటన గురించి మాట్లాడుతూ ‘‘అది చాలా బాధాకరమైన సంఘటన. రాష్ట్ర నాయకులు అక్కడకు వెళ్ళడానికి
ప్రయత్నిస్తే వారిని పోలీసులు, స్థానిక టీఎంసీ నాయకులూ రానీయకుండా నిలిపివేసారు.
అయినా బీజేపీ నేతలు అక్కడకు వెళ్ళి బాధిత మహిళలకు అండగా నిలిచారు. సందేశ్‌ఖాలీ
బాధితుల కోసం బీజేపీ తుదకంటా పోరాడుతుంది’’ అని చెప్పారు.
జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఈ ఉదయం బీజేపీ
బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీలో చేరారు. కోల్‌కతాలో జరిగిన
ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.
ఆ సందర్భంగా సుకాంత మజుందార్ మాట్లాడుతూ ‘‘మాజీ
న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయని మా పార్టీలోకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ
కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. ఒక న్యాయమూర్తిగా అణగారిన, దోచుకోబడిన వర్గాలకు న్యాయం
కోసం ఆయన ఎంతో కృషి చేసారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కూడా అలాగే శ్రమిస్తారని
ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సమీప భవిష్యత్తులో బెంగాల్ రాజకీయాలు మారిపోతున్నాయి.
బెంగాల్‌కు చెందిన విద్యావంతులైన యువత ముందడుగు వేయడానికి, రాష్ట్ర సంక్షేమం కోసం
రాజకీయాల దిశను మార్చడానికీ ఇదే సరైన సమయం’’ అని వ్యాఖ్యానించారు.
అభిజిత్ గంగోపాధ్యాయ ఈ నెల మొదట్లోనే కలకత్తా
హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసారు. అప్పుడే తను బీజేపీలో చేరతానని ప్రకటించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తామ్లుక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న
అంచనాలున్నాయి. తామ్లుక్ 2009 నుంచి ఇప్పటివరకూ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు
కంచుకోటగా ఉంది. అయితే అభిజిత్ మాత్రం తన పోటీ గురించి ఏమాటా చెప్పలేదు.