Why BJD is trying for alliance with BJP after 15 years?
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… ఒడిషాలో
అధికార బిజూ జనతాదళ్, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీతో పొత్తు
కుదుర్చుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. పదిహేనేళ్ళ క్రితం ఎన్డీయే
నుంచి బైటకు వచ్చిన బీజేడీ, ఇప్పుడు మళ్ళీ ఎన్డీయేలో చేరాలనుకోవడం దేన్ని
సూచిస్తోంది?
నిన్న అంటే బుధవారం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో,
రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం నవీన్ నివాస్‌లో బీజేడీ
పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒడిషా
బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, ఇతర రాష్ట్రపార్టీ నేతలు, పార్టీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చర్చలు జరిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ
రెండు పార్టీల మధ్యా పొత్తు కోసమే ఆ సమావేశాలు జరిగినట్లు సమాచారం.
బీజేడీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరితే అది రాష్ట్ర
రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి, ఎన్డీయే నుంచి బీజేడీ విడిపోయి
15 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు మళ్ళీ అదే కూటమిలో చేరడానికి సుముఖత చూపుతుండడం
గమనార్హం. అప్పట్లో బీజేపీ నేత సుష్మా స్వరాజ్, పదకొండేళ్ళ బంధాన్ని తుంచుకుంటున్నందుకు
నవీన్ పట్నాయక్ ఎప్పటికైనా బాధపడతారని వ్యాఖ్యానించారు.
నిజానికి ఇప్పటివరకూ బీజేడీ ఎన్డీయే కూటమిలో
చేరుతున్నట్లు అధికారిక ప్రకటన అయితే రాలేదు. చర్చలైతే జరిగాయి కానీ తుది నిర్ణయం
తీసుకోలేదని బీజేడీ ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్ మిశ్రా చెప్పారు. ఒడిషా ప్రజల
ప్రయోజనాలే బీజేడీకి ప్రధానం అని ఆయన వివరించారు.
బుధవారం సుదీర్ఘ మంతనాల తర్వాత బీజేడీ ఒక ప్రకటన
విడుదల చేసింది. ‘‘2036 నాటికి ఒడిషాకు రాష్ట్ర హోదా వచ్చి వందేళ్ళు గడుస్తాయి. ఆ
సమయానికి రాష్ట్ర పురోగతిలో పలు మైలురాళ్ళు సాధించాలని బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి
నవీన్ పట్నాయక్ లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఒడిషా ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఆ
లక్ష్యాలను సాధించడం కోసం బీజేడీ అన్నివిధాలుగా ప్రయత్నిస్తుంది’’ అని ఆ ప్రకటనలో
వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశంలో ఎన్నికలకు
ముందు బీజేడీతో పొత్తు గురించి చర్చలు జరిగాయని పార్టీ సీనియర్ నేత, ఎంపీ జుయెల్
ఓరామ్ నిర్ధారించారు. అయితే పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం
తీసుకుంటుందని స్పష్టం చేసారు.
ఒడిషాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ
స్థానాలూ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేడీ 12 లోక్‌సభ, 112 శాసనసభ స్థానాలను
గెలుచుకుంది. బీజేపీ 8 ఎంపీ, 23 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఒకవేళ పొత్తు
కుదిరితే బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లను తీసుకుంటుందనీ, బీజేడీ ఎక్కువ శాసనసభ
స్థానాలను తీసుకుంటుందనీ అంచనాలున్నాయి. మొత్తం 21 ఎంపీ సీట్లలో బీజేపీ 13-14 స్థానాల్లో
పోటీ చేయవచ్చు. అలాగే శాసనసభలోని 147 స్థానాల్లో 105 సీట్లలో బీజేడీ పోటీ
చేయవచ్చు.
బీజేపీ-బీజేడీ మొదటిసారి 1998 ఫిబ్రవరిలో పొత్తు
కుదుర్చుకున్నాయి. 1998, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లోనూ, 2000, 2004 శాసనసభ ఎన్నికల్లోనూ
కలిసి పోటీ చేసాయి, మంచి ఫలితాలు సాధించాయి. ఎన్డీయేలో బీజేపీకి ఆప్తమిత్ర
పార్టీగా బీజేడీ ఉండేది. 2009 ఎన్నికల సమయంలో ఇరు పార్టీల మధ్యా సీట్ల పంపకంలో
భేదాభిప్రాయాలు వచ్చాయి. బీజేపీ తను పోటీ చేసే సీట్ల సంఖ్యను తగ్గించుకోవాలని
నవీన్ పట్నాయక్ పట్టుపట్టారు. లోక్‌సభలో 9కి బదులు 6స్థానాల్లో, శాసనసభలో 63కు
బదులు 40స్థానాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. దానికి
ఒప్పుకోని బీజేపీ, అప్పటి బీజేడీ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ
చర్యను బీజేడీ నమ్మకద్రోహంగా అభివర్ణించింది. అలా 11ఏళ్ళ జమిలి ప్రయాణం ముగిసింది.
2004 ఎన్నికల నుంచీ ఇరుపార్టీలూ విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
ఒడిషాలో గత పదిహేనేళ్ళలోనూ బీజేడీ, బీజేపీల
ఎదుగుదల సమాంతరంగా సాగుతోంది. కాంగ్రెస్ ఓ పక్క తన సీట్లు, ఓట్లు కోల్పోతుంటే…
ఒకప్పటి మిత్రపక్షాలు రెండూ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో 35-40శాతం
ఓట్లు సాధించే అవకాశమున్న బీజేపీని దూరం పెట్టడం సరికాదని బీజేడీ భావిస్తున్నట్లు
అర్ధమవుతోంది.
2009 ఒడిషా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ 103
స్థానాలు గెలుచుకుని 38.9శాతం ఓట్లు సంపాదించింది. అది 2014 నాటికి 117 సీట్లకూ,
43.9శాతం ఓట్లకూ పెరిగింది. 2019లోనూ అదే ట్రెండ్ కొనసాగి 112 స్థానాలూ, 45.2శాతం
ఓట్లూ సాధించింది. బీజేపీ కూడా క్రమమైన ఎదుగుదల సాధించింది. 2009లో 15.1శాతం ఓట్లతో
1 స్థానం గెలిచింది. 2014లో 10స్థానాలు సొంతం చేసుకుంది, ఓటుశాతం 18.2కు
పెంచుకుంది. 2019 ఎన్నికల్లో ఏకంగా 23 స్థానాల్లో 32.8శాతం ఓట్లతో విజయం సాధించింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం దిగజారుతూ వస్తోంది. 2009లో 29శాతం
ఓట్లతో 27 సీట్లు గెలుచుకుంది. 2014లో ఓట్లశాతం 26కు, సీట్ల సంఖ్య 16కూ తగ్గింది.
2019లో ఓట్లశాతం 16.3కూ, సీట్ల సంఖ్య 9కీ దిగజారింది.
పార్లమెంటు ఎన్నికల విషయంలోనూ అదే కథ పునరావృతమవుతూ
వస్తోంది. 2009లో బీజేడీ 14 ఎంపీ స్థానాల్లో 37.2శాతం ఓట్లతో గెలిచింది. 2014లో
ఏకంగా 20స్థానాల్లో 44.8శాతం ఓట్లతో ఘనవిజయం సాధించింది. కానీ 2019లో కేవలం 43.3శాతం
ఓట్లతో 12స్థానాలకు పరిమితమైంది. బీజేపీ విషయానికి వస్తే 2009లో 16.9శాతం ఓట్లు
సాధించగలిగినా ఒక్క ఎంపీ సీటునూ గెలవలేకపోయింది. 2014లో 21.9శాతం ఓట్లతో ఒక స్థానం
గెలుచుకుంది. ఇంక 2019లో ఏకంగా 38.9శాతం ఓట్లతో 8 ఎంపీ సీట్లలో విజయం సాధించింది.
కాంగ్రెస్ కథ మాత్రం పతనదిశలో కొనసాగింది. 2009లో కాంగ్రెస్ 32.7శాతం ఓట్లతో 6
సీట్లలో విజయం సాధించింది. కానీ 2014లో 26.4శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది, ఒక్క
సీటునూ గెలవలేకపోయింది. ఇక 2019లో ఒక ఎంపీస్థానంలో గెలిచినా, ఓట్లశాతం 14కు
దిగజారిపోయింది.
ఇంక అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు
ఎన్నికల్లో సైతం బీజేపీ చాలా ఎక్కువ సీట్లలో రెండోస్థానంలో నిలిచింది. ఇదే ఊపు
కొనసాగితే 2024 ఎన్నికల్లో బీజేడీకి తక్షణ ముప్పు ఉన్నది బీజేపీ నుంచే. కమలం
పార్టీ తమ ఓట్ల శాతాన్నీ సీట్ల సంఖ్యనూ పెంచుకుంటూ పోయి, ఒడిషాలో సొంతంగా జెండా
ఎగరేసే అవకాశం సాధిస్తుంది. దాదాపు 35-40శాతం ఉన్న బీజేపీ ఓటుబ్యాంకు మరో 5శాతం
పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ ఓట్లు తమ పార్టీ నుంచే బీజేపీ సొంతం అయే
అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో స్వీయఅస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే, నవీన్
పట్నాయక్ పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ స్నేహ హస్తం అందిస్తున్నాడని భావించవచ్చు.