ఆమ్
ఆద్మీ పార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు,
రౌస్ అవెన్యూస్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 16న కోర్టు ముందు తప్పనిసరిగా
హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
మద్యం
పాలసీ కుంభకోణంలో భాగంగా నగదు అక్రమ చలామణి కేసులో విచారించేందుకు కేజ్రీవాల్‌కు పలుమార్లు
సమన్లు జారీచేసినా బేఖాతరు చేశారంటూ ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ పిటిషన్
ను విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ కు సమన్లు
జారీ చేసింది. మార్చి 16న తప్పనిసరిగా న్యాయస్థానంలో హాజరుకావాలని స్పష్టం చేసింది.
మద్యం
కుంభకోణం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ
తాఖీదులు పంపింది. వాటికి ఆయన స్పందించలేదు.
మొదటి మూడు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదని
గత నెల కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం, ఫిబ్రవరి
17న
కోర్టుకు రావాలని ఆదేశించింది. అప్పుడు అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా
హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతాని విన్నవించారు. దీంతో
న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
ఈ
అంశం కోర్టులో పెండింగ్ ఉండగానే, ఈడీ
మళ్లీ సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలంటూ ఈడీ పంపిన
నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు.
విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా
ఉన్నానని ఈడీకి లేఖ రాసిన కేజ్రీవాల్, మార్చి 12 తర్వాతే వర్చువల్‌గా హాజరవుతానని మెలిక
పెట్టారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును
ఆశ్రయించగా న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేసింది.
మద్యం
కుంభకోణం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ ను సీబీఐ.. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు విచారించింది. ఇప్పుడు ఈడీ
కేసులో కోర్టు తాఖీదులు జారీ చేసింది.