శ్రీశైలంలో
శ్రీభమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు పుష్పపల్లకీ సేవ వైభవంగా
నిర్వహించారు. దేవదేవుల సేవల రకరకాల పుష్పాలు వినియోగించారు.
మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు(బుధవారం) సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన
పల్లకిలో స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు. పుష్పపల్లకిలో ఆదిదంపతుల
గ్రామోత్సవంతో శ్రీశైలం, ఇల కైలాసాన్ని తలపించింది. పుష్పపల్లకిలో విహరించే ఆదిదంపతులను
దర్శించుకున్న వారిని కష్టాలు వీడి సుఖసంతోషాలు వరిస్తాయని పండితులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలు
నేడు ఏడో రోజుకు చేరడంతో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి గజ వాహన సేవ
నిర్వహించనున్నారు. గ్రామోత్సవం లో భాగంగా సాయంత్రం, ఆదిదంపతులు గజవాహనంపై నుంచి
భక్తులను కటాక్షిస్తారు.
మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన దేవాలయ
అధికారులు, 35 లక్షల లడ్డూ ప్రసాదం
ప్యాకెట్లు తయారు చేయించారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదం
విక్రయిస్తున్నారు. దేవస్థానం లడ్డూపోటులోని 35 మంది సిబ్బందితో పాటు విజయవాడ, ఇతర
ప్రాంతాల నుంచి మరో 150 మందిని పిలిపించి ప్రసాదం తయారు చేయిస్తున్నారు. భక్తులు
అడిగినన్ని లడ్డూలు విక్రయించేలా చర్యలు తీసుకున్నారు.
శ్రీగిరికి
పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్పీ రఘువీర్ రెడ్డి, క్షేత్ర పరిధిలో తనిఖీలు నిర్వహించి విధి నిర్వహణలోని
సిబ్బందికి కీలక సూచనలు చేశారు. 1,619 మంది సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు.